ఇసుక దందాపై మౌనమేల?
గాంధీనగర్లో భారీ ఇసుక డంప్లు.. అర్ధరాత్రి రవాణాపై ఆరోపణలు
చర్యలు లేకపోవడంపై స్థానికుల్లో అనుమానాలు.. సమగ్ర విచారణకు డిమాండ్
బూర్గంపాడు, జూలై26 (విజయక్రాంతి): మండలంలో అక్రమ ఇసుక దందా మరోసారి చర్చనీయాంశంగా మారింది. గాంధీనగర్, భాస్కర్నగర్, రాజీవ్నగర్ ప్రాంతాల్లో భారీ ఎత్తున అక్రమంగా ఇసుక నిల్వలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాంధీనగర్లోని ఏటీఎం పక్క సందు నుంచి వెళ్లే రహదారి పక్కనున్న ఖాళీ స్థలంలో సుమారు 20 ట్రాక్టర్ల మేర ఇసుకను డంప్ చేసి ఉంచినట్లు చెబుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం అర్ధరాత్రి వేళల్లో నదుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి వివిధ ప్రాంతాల్లో నిల్వ చేసి, అనంతరం ట్రాక్టర్కు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఫొటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియాలో ఆధారాలు వైరల్ అవుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
500కు పైగా ట్రిప్పుల నిల్వలున్నాయా?
గాంధీనగర్, భాస్కర్నగర్, రాజీవ్నగర్ ప్రాంతాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహిస్తే సుమారు 500 నుంచి 600 ట్రాక్టర్ ట్రిప్పు ల మేర అక్రమ ఇసుక నిల్వలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నా రు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించకపోవ డంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఆరోపణలపై విచారణ జరపాలి
అక్రమ ఇసుక రవాణాలో కొందరు సం బంధిత అధికారుల ప్రమేయం ఉందంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారిక ధృవీకరణ లేదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి, ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






