సంస్కరణలు కొనసాగేనా!
ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రిగా అయిదేళ్లు పూర్తి పదవీ కాలం పూర్తిచేసుకున్న తొలి మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భౌగోళిక, రాజకీయ సవాళ్లు ఎదురయినప్పటికీ కోవిడ్ మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునేలా చేయడంతో పాటుగా ఆర్థిక స్థిరీకరణను సాధించడంతో ఆమె విజయం సాధించారు. రెండోసారి కూడా మోడీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మపై దేశ ఆర్థిక వ్యవస్థతో పాటుగా స్టాక్ మార్కెట్ వర్గాలు కూడా గంపెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ తొలి అయిదేళ్ల కాలం మరపురానిదని, ఎందుకంటే కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థను మాత్రం బలమైన వృద్ధి పథంలో నడిపించరని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పదికి ఎనిమిది మార్కులు
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా స్థూల ఆర్థిక రంగాలు పెను సవాళ్లను ఎదుర్కొన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి తొలి అయిదేళ్ల పదవీ కాలానికి పదికి ఎనిమిది మార్కులు కచ్చితంగా లభిస్తాయని ఏంజల్ వన్ సంస్థ రిసెర్చ్ విభాగం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అమర్ సింగ్ దేవ్ అభిప్రాయపడ్డారు.‘ఆర్థిక మంత్రిగా తొలి అయిదేళ్ల కాలంలో ముఖ్యంగా కొవిడ్ 19 మహమ్మారి సమయంలో పెను సవాళ్లు ఎదురయినప్పటికీ నిర్మలా సీతారామన్ ఆర్థిక వివేకం, ఆర్థిక ఉద్దీపన మధ్య గొప్ప సమతుల్యతను ప్రదర్శించగలిగారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజిని వ్యూహాత్మకంగా అమలు చేయడంతో, మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల రంగం(ఎంఎస్‌ఎంఇ), వైద్యరంగాలకు మద్దతు అందించడంలో, అలాగే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న వర్గాలను ఆదుకోవడంలో ఆమె విజయం సాధించారు’ అని హొడొనోవా సీఐఓ సుమన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. అయితే వడ్డ్డీరేట్లు ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా అధిక ఆదాయ వర్గాలపై వివాదాస్పద సర్‌చార్జి విధించడం, కొన్ని వస్తు, సేవలపై పన్పులు పెంచడం లాంటి వాటి విషయంలో ఆమె విమర్శలు ఎదుర్కొన్నారని, ఆర్థిక వ్యవస్థ కోలుకొంటున్న తరుణంలో ఈ నిర్ణయాలు భారంగా మారుతాయని కొంత మంది అభిప్రాయపడ్డారని హెచ్‌డిఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో రిటైల్ హెడ్‌గా పని చేస్తున్న దీపక్ జసానీ అభిప్రాయపడ్డారు.
సీతారామన్ పనితీరుకు అనుగుణంగా మార్కెట్లు కూడా మారిపోయాయని, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధినిమరింత వేగవంతం చేయడంలో ఆమె సామర్థ్యంపై విశ్వాసాన్ని కొనసాగించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని నమోదు చేసుకుంది. దేశానికి తొలి ఫుల్‌టైమ్ మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయడం, 2023 ఫైనాన్స్ చట్ంటలో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రవేశ పెట్టడం, కోవిడ్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటు అందించడం కోసం ఈ రంగంలో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీజీఎస్)ను ప్రవేశపెట్టడం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో ఆర్థికక్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించడం లాంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు’అని జసానీ అభిప్రాయపడ్డారు.
తోడ్పడనున్న అనుభవం
కోవిడ్ మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతానికి చేరుకున్న ఆర్థిక లోటును 2024 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి తగ్గించడంలో ఆమె విజయం సాధించారు. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి దీన్ని 4.5 శాతానికి తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం. రాబోయే బడ్జెట్‌లో దీనికి సంబంధించిన సంకేతాలు ఉండవచ్చని మార్కె ట్ ఆశిస్తోంది’ అని ఆయన అన్నారు.‘ పరోక్ష, ప్రత్యక్ష పన్నుల వసూ ళ్లు , ఆర్థిక సమతుల్యత, జీడీపీ వృద్ధి, పన్ను చెల్లింపులు పన్ను చెల్లింపుదారుల బేస్ వృద్ధి.. ఇలా అన్ని రంగాల్లోను ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొలి అయిదేళ్ల పదవీ కాలం లో ఎంతో వృద్ధి కనబడింది.
రెండో సారి ఆర్థిక మంత్రిగా ఆమె మరింత మెరుగ్గా పని చేయడానికి ఆ అనుభవం తోడ్పడుతుంది’ అని ప్రముఖ ఆర్థిక నిపుణుడు చొక్కలింగం వ్యాఖ్యానించారు. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌ను, కరెంట్ అకౌంట్ మిగులును దేశ ఆర్థిక వ్యవస్థలో శాశ్వత అంశాలుగా చేయడానికి, తద్వారా ద్రవ్య లోటును స్థూల జాతీయ ఉత్పత్తి( జీడీపీ)లో 4 శాతానికి తగ్గించడానికి ఆమె ప్రయత్నించవచ్చని కూడా చొక్కలింగం అభిప్రాయపడ్డారు. రాబోయే బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ వ్యక్తిగత దాయపన్నును కార్పొరేట్ ఆదాయ పన్నుతో సమానం చేయడానికి రాయితీలు ప్రకటిస్తారని చొక్కలింగం అభిప్రాయపడగా, అధిక వృద్ధికి దోహదపడే అంశాలకు ఆమె ప్రాధాన్యత ఇవ్వవచ్చని జసానీ నమ్ముతున్నారు.
రాజకీయ సుస్థిరతే కీలకం
ఇవన్నీ ఇలా ఉంటే రాబోయే అయిదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో విధానాల కొనసాగింపు, రాజకీయ సుస్థిరతల ప్రభావం మార్కెట్లపై ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి రెండో సారి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై మార్కెట్ల స్పందన బాగానే ఉన్నప్పటికీ రాబోయే బడ్జెట్‌పైనే దృష్టి అంతా ఉంది. నిర్మలా సీతారామన్‌ను రెండో సారి ఆర్థిక మంత్రిగా నియమించడంపై మార్కెట్లు సానుకూలంగానే స్పందించే అవకాశం ఉందని, మార్కెట్లలో అనిశ్చితి తగ్గే అవకాశం ఉందని డిఆర్‌ఎస్ ఇన్వెస్ట్ వ్యవస్థాపకుడు రవిసింగ్ అభిప్రాయపడ్డారు.
సంస్కరణల కొనసాగింపుపై విశ్వాసం
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించే విషయంలో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కనబరిచిన పనితీరు దృష్ట్యా ఇప్పుడు కూడా ఆమెనుంచి మార్కెట్ వర్గాలు ఎంతో ఆశిస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ సొంతం గా మెజారిటీ స్థాయికి చేరుకోని తరుణంలో సంకీర్ణ ప్రభుత్వం బలమైన విధానపరమైన సంస్కరణలను అందించకపోవచ్చన్న అనుమానాలు న్నప్పటికీ మంత్రివర్గం కూర్పు కొత్త ప్రభుత్వం విధానపరమైన సంస్కరణ విషయంలో రాజీ పడకపోవచ్చన్న సంకేతాలను ఇచ్చింది.
‘ మొత్తం మంత్రివర్గం కూర్పు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన విధానాలను కొనసాగిస్తునందన్న ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తోంది. ప్రధానమైన శాఖలన్నీ కూడా బీజేపీ వద్దే ఉన్నాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయ్ కుమార్ అంటున్నారు. నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక స్థిరీకరణ ముఖ్యమనిఆయన అభిప్రాయపడ్డారు.






