న్యూ ఇన్‌కం ట్యాక్స్ విధానంలో మినహాయింపు పరిమితి 5 లక్షలు?
కొన్ని పన్ను రేట్లు తగ్గించే యోచనలో కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 18: వచ్చే బడ్జెట్లో కొన్ని వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని, పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మనీకంట్రోల్ మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే పన్ను మినహాయింపు పరిమితి పెంపు కేవలం కొత్త పన్ను విధానంలో రిటర్న్‌లు ఫైల్ చేసేవారికి మాత్రమే వర్తింపచేస్తారని ఆ వర్గాలు తెలిపాయి. జూలై ద్వితీయార్థంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు బడ్జెట్‌ను సమర్పిస్తారని భావిస్తున్నారు.
రిటర్న్‌లు ఫైల్ చేసుకోవడానికి ప్రస్తుత ఐటీ పద్ధతి, కొత్త ఐటీ పద్ధతిలో ఏదో ఒకదానిని ఎంచుకునే అవకాశాన్ని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2020 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. పాత విధానంలో పొదుపు, బీమా తదితర పెట్టుబడులపై కొన్ని మినహాయింపులు, పన్ను తగ్గింపులు ఉంటాయి. హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ వంటివి క్లుయిం చేసుకోవచ్చు. రూ.5 లక్షల పన్ను ఆదాయం వరకూ ట్యాక్స్ రిబేట్ ఉంటుం ది.
ఆపైన ఆదాయం ఉన్నవారు రూ.2.50 లక్షల నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల పన్ను ఆదాయం వరకూ పన్ను ఉండదు. ఆపైన ఆదాయం ఉన్నవారు రూ. 3 లక్షల నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూ.3 లక్షల పరిమితినే రూ. 5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కొత్త పన్ను విధానాన్ని ఆప్ట్ చేసేవారికి చాలావరకూ పొదుపు పెట్టుబడులపై మినహాయింపులేవీ ఉండవు.






