డ్రగ్స్ రహిత గ్రామాల కోసం చర్యలు తీసుకోవాలి
కోనరావుపేట ఏప్రిల్ 27 (విజయక్రాంతి):కోనరావుపేట మండలంలో యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ఇంచార్జి బనోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు డ్రగ్స్కు బానిసలవుతున్న పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందన్నారు.
యువత చెడు అలవాట్లకు లోనవడం వారి భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ సరఫరాను అరికట్టాలని, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్య సమస్యలు, నేర ప్రవర్తన, విద్యలో వెనుకబడటం వంటి తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలిపారు.
యువతను కాపాడేందుకు పోలీసు శాఖ మరియు గ్రామపంచాయతీలు కలిసి డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత గ్రామాలు విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత అనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జి రాజు నాయక్, తిరుపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.






