13 July, 2026 | 1:01 AM

భీమన్న ఆలయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

13-07-2026 12:19 AM

ఈవో ఎల్ రమాదేవి

వేములవాడ, జులై 12, (విజయ క్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆమె క్షేత్రస్థాయిలో పలు విభాగాలను పరిశీలించారు.టెంకాయలు కొట్టే ప్రాంతాన్ని తనిఖీ చేసిన ఈవో.. అక్కడ భక్తుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అని ఆరా తీశారు.

టెంకాయలు కొట్టేందుకు లేదా ఇతర సేవల పేరుతో ఎవరికీ నగదు ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆలయ మైక్ ద్వారా భక్తులకు సూచించారు.కోడె మొక్కులు చెల్లించే భక్తులకు విక్రయిస్తున్న పచ్చిగడ్డి, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన వస్తువులే అందించాలని టెండర్దారులను ఆదేశించారు. దీపారాధన ప్రాంతంలో సహజ నెయ్యినే వినియోగించేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన క్యూలైన్లు, టికెట్ జారీ విధానం, మొక్కుల నిర్వహణను పరిశీలించిన ఈవో, వృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తనిఖీల్లో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ పరిశీలకులు వంశీ మోహన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.