17 April, 2026 | 3:08 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉంచాలి

17-04-2026 12:02 AM

మేడ్చల్, ఏప్రిల్ 16(విజయ క్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి ఉమా గౌరి సంబంధిత సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా డిప్యూటీ వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడువు ముగియనున్న మందుల కోసం ప్రత్యేక కార్నర్ ఏర్పాటు చేయాలని, గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం డిస్పాచ్ చేయాలని సూచించారు.

అప్డేటెడ్ ఈడిడి క్యాలెండర్ ను ప్రదర్శించాలని, చిన్నపిల్లల టీకా కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహించాలన్నారు. గర్భిణుల సేవలు, రక్తహీనత, హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రసవసేవలను జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మాతృ మ రణాన్ని నివారించాలన్నారు. టీబీ, ఎన్ సి డి సంబంధిత రోజువారి సేవలను నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.

జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు సేకరించి నెల రోజుల్లో నివేదికను డిఎంహెచ్‌ఓ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. వైద్య అధికారులు తప్పనిసరిగా ఏ బి హెచ్ ఏ అటెండెన్స్ను సమయానికి నమోదు చేసి సంబంధిత గ్రూపులో పోస్ట్ చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మాతృ ఆరోగ్యం, పోషణ, కుటుంబ నియంత్రణ, టీకాలు, సంక్రమణ, అసంక్రమణ వ్యాధులు,

వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, సిబ్బంది వివరాలు, ఖాళీలు, ఔషధాలు నిలువలు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, పెండింగ్ బిల్లులు, కాయకల్ప కార్యక్రమం తదితర విషయాలపై డిఎంహెచ్వో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ గీత, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ లావణ్య, డాక్టర్ కౌశిక్, డిప్యూటీ డెమో వసంత కుమారి, జిల్లా క్వాలిటీ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.