28 July, 2026 | 10:11 PM

మెగా డీఎస్సీ ప్రకటించాలి

25-06-2024 04:34 AM
  • అందులోనే ప్రమోషన్స్, ఖాళీల భర్తీ చేపట్టాలి
  • ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలి
  • డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు డిమాండ్
  • రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి) : మెగా డీఎస్సీ ప్రకటించాలని, టీచర్ల ప్రమోషన్స్ ద్వారా ఏర్పడే ఖాళీలు ప్రస్తుత డీఎస్సీ లోనే కలిపి నిర్వహించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. జిల్లాల్లోని గ్రంథాలయాల వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులకు మరో 6 వేలు కలిపి మొత్తం 11,062 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో దాదాపు 15 వేల ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని, వీటిని కూడా ఈ డిఎస్సీలో చేర్చాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో వద్దని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విద్యాశాఖ ఇంకా ప్రకటించలేదు. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలని ప్రకటించిన విద్యాశాఖ రోజూవారీ టైంటేబుల్‌ను విడుదల చేయలేదు.