ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన.. 'మెల్‌బోర్న్ షో హౌస్ ఫుల్.. బ్లాక్ బస్టర్'
మెల్‌బోర్న్ లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. 'మెల్‌బోర్న్ మీట్స్ మోదీ ఈవెంట్'(Melbourne Meets Modi) కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 30 వేల మంది ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మోదీకి ఘనస్వాగతం పలికారు. మెల్ బోర్న్ లోని మార్వెల్ స్టేడియం మోదీ మోదీ నినాదాలతో హోరెత్తింది. ఆస్ట్రేలియాలోని ఈ ప్రదర్శన హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అని మోదీ పేర్కొన్నారు. ఫ్లాష్ ఫోన్ లైట్ల ద్వారా ఆస్ట్రేలియా ప్రధానికి స్వాగతించామని తెలిపారు. గతంలో రెండుసార్లు సిడ్నీలో మిమ్మల్ని కలిశానని సూచించారు. మెల్ బోర్న్ స్టేడియంలో అపూర్వ స్వాగతం మరిచిపోలేనని నరేంద్ర మోదీ వెల్లడించారు.
అహ్మదాబాద్ .. ప్రపంచలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. మెల్ బోర్న్ .. ఐకానిక్ స్టేడియంగా ప్రసిద్ధి చెందిందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య క్రికెట్ బంధం బలపడిందని తెలిపారు. 2014లో ఆస్ట్రేలియాలో తాను పర్యటించానని వివరించారు. తన పర్యటనకు 18 ఏళ్ల ముందు వరకు ఏ ప్రధాని పర్యటించలేదన్నారు. 12 ఏళ్లలో మూడుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించానని చెప్పారు. ఇరుదేశాల సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో ప్రవాస భారతీయులది కీలక పాత్ర అన్నారు. మెల్ బోర్న్ ప్రాంతం భారతీయ సంస్కృతితో నిండి ఉంటుందన్నారు.
మెల్ బోర్న్ ను మినీ ఇండియాగా పిలుస్తారని చెప్పిన నరేంద్రుడు ఏ పేరుతో పిలిచినా భారతీయ ఛాయ ప్రస్ఫుటం అవుతుందన్నారు. మీ అందరూ ఆస్ట్రేలియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రేమాభిమానాలతో ఆదరణ పొందుతారని సూచించారు. పాలు ఆస్ట్రేలియావైనా భారతీయతతో కూడిన చాయ్ తయారువుతోందని వివరించారు. పప్పు, కూరగాయలు ఆస్ట్రేలియావైనా భారత మసాలాలతోనే వంట అన్నారు. గ్రోమోర్ అచీవ్ మోర్ నినాదంతో ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. 5జీ రంగంలో భారత్ వేగంగా దూసుకెళ్తోందన్నారు.
త్వరలో మెల్ బోర్న్ లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని ప్రకటించారు. ఆస్ట్రేలియా అభివృద్ధిలో భాగమైనా భారత్ పై ఎప్పుడూ మీ చూపు ఉంటుందని ఆయన తెలిపారు. భారత్ ప్రగతి గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారన్నారు. ఒక లక్ష్యం పూర్తయితే మరో సంకల్పం తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా మారుతామని సూచించారు. చంద్రయాన్ ద్వారా తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టామన్నారు. అంతరిక్షంలోకి గగన్ యాన్ పంపేందుకు భారత్ సిద్ధమవుతోందని వివరించారు. భారత్.. సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోందని ప్రధాని వెల్లడించారు.






