సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం సోమశిలలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) గురువారం రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లలిత సోమేశ్వర దేవాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. సోమశిల, ముక్కిడిగుండం, మొల్లచింతపల్లి, నార్లాపూర్, రామాపురం, చెన్నంపల్లి, ఎంగంపల్లి గ్రామాలకు సంబంధించిన పెండింగ్ భూ రికార్డుల సమస్యలను అధికారులు, రైతుల సమక్షంలో మంత్రి సమీక్షించి పరిష్కార చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని అటవీ అధికారులను ఆదేశించారు. రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే అటవీ భూములకు సంబంధించిన చట్టాలను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే ఉందని, కొన్ని సమస్యల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో చట్ట సవరణలు అవసరమన్నారు.
ధరణి అమలుకు ముందు హక్కు పత్రాలు కలిగిన రైతులకు రైతుబంధు వచ్చేదని, ధరణి తర్వాత కొందరికి ఆ సాయం అందడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కొత్త పాస్‌బుక్కులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి, వెంకటస్వామి, కొల్లాపూర్ ఆర్డీవో బోన్స్‌లాల్, ఎమ్మార్వో మాధవి, పెంట్లవెల్లి ఎమ్మార్వో శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






