16 July, 2026 | 6:45 PM

మగాళ్లకు అన్యాయం జరుగుతోంది

12-12-2024 12:19 AM

* ప్రతీకారం తీర్చుకునేందుకు చట్టాల దుర్వినియోగం

* కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తమ భర్తలు, కుటుంబాలపై మహిళలు దాఖలు చేసే వివాహ వివాద కేసుల్లో చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వ్యక్తిగత పగను తీర్చుకునేందుకు చట్టాన్ని సాధనంగా ఉపయోగించడం సరికాదని పేర్కొంది. తనను వేధిస్తున్న భర్త, అతడి కుటుంబంపై సెక్షన్ 498(ఎ) కింద ఓ మహిళ కేసు వేసింది. ఈ కేసును కొట్టేయాలని ప్రతివాది కోరగా తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో అతడు సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.

తాజాగా కేసును విచారించిన బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తమ భర్తలు, కుటుంబ సభ్యులపై వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 498(ఎ) లేదా సెక్షన్ 86 వివాహిత స్త్రీలపై దాడులకు సంబంధించి భర్త లేదా అతడి బంధువుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఈ చట్టం ప్రకారం నేరం ఖరారైతే నిందితుడికి 3 ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో అతడి భార్య ఈ సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఇలాంటి కేసుల్లో కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను అందించకుండా కేవలం వారి పేర్లను ప్రస్తావించడం మాత్రమే నేర విచారణకు ఆధారం కాదని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది.