అమెరికా చదువులపై అనాసక్తి
* అగ్రరాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వని భారత యువత
* తొమ్మిది నెలల్లో 38శాతం తగ్గిన వీసాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని, అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని భారత యువత కలలు కనేది. ఏటా వేలాది మంది యువతీ యువకులు ఎఫ్1 వీసాలు తీసుకుని అగ్రరాజ్యానికి పయనమవుతుంటారు. అమెరికా వ్యాప్తంగా 11.26 లక్షల మంది ప్రవాస విద్యార్థులు చదువుతుండగా, వారిలో 29శాతం మంది భారత్ విద్యార్థులు కావడమే అందుకు నిదర్శనం. కానీ.. ఈ ఏడాది భారత విద్యార్థులకు ఎఫ్1 వీసాల జారీ గణనీయంగా తగ్గిందని అమెరికా విదేశాంగశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన తొమ్మిది నెలల్లో 38శాతం వీసాలు తగ్గాయని తేటతెల్లమైంది.
గతేడాది కంటే తక్కువ వీసాలు..
బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదిక ప్రకారం.. గతేడాది జనవరి సెప్టెంబర్ మధ్య 1,03,495 మందికి ఎఫ్1 వీసాలు అందాయి. ఈసారి కేవలం 64,008 మందికి మాత్రమే వీసాలు జారీ అయ్యాయి. కొవిడ్ సంక్షోభం తర్వాత ఇంత తక్కువ స్థాయిలో దరఖాస్తులు తగ్గడం ఇదే మొదటి సారి. 2021లో 65,235 మందికి, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. మరోవైపు చైనా విద్యార్థులకు జారీ అయ్యే వీసాల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది 8శాతం తగ్గుదల కనిపిస్తున్నది.
ఎఫ్1 వీసా అంటే..
ఎఫ్1 వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా. దీంతో విద్యార్థులు అమెరికాలో ఉంటూ ఫుల్ టైమ్ విద్యనభ్యసించవచ్చు. దీనిలో భాగంగా అక్కడి విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తాయి. భారత్ నుంచి ఎక్కువ మంది ఆగస్టు ఆరంభంలో వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు.






