17 April, 2026 | 3:12 AM

కాంట్రాక్టర్ ఖాతాకు.. మెప్మా నిధులు!

17-04-2026 01:16 AM
  1. రూ. 1.96 లక్షల నిధులు మళ్లించిన మున్సిపల్ అధికారులు

స్ట్రీట్ వెండర్ అవగాహన సదస్సు లేకుండా డ్రా చేసేందుకు యత్నం

అచ్చంపేట, ఏప్రిల్ 16: పట్టణాల్లో వీధి వ్యాపారులు వారి కుటుంబాలకు సామాజిక భధ్రత ప్రయోజనాలు కల్పించి.. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 1న ‘పీఎం స్వనిధి సే సమృద్ధి’ పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మున్సిపాలిటీల పరిధిలోని వీధి వ్యాపారులకు అవసర మైన అవగాహన సదస్సులు, బ్యాంకుల ద్వారా స్వల్ప కాలిక రుణసదుపాయం తీసుకోవడం, తిరిగి చెల్లించే విధానంపై శిక్షణ శిభిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

దీని కోసం కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెఫ్మా) ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంటుం ది. అందుకు అప్పట్లోనే ప్రతి మున్సిపాలిటీకి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. అలా జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మున్సిపా లిటీలకు నిధులు మంజూరు కాగా.. కొల్లాపూర్ మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలు అవగాహన సదస్సులు నిర్వహించినట్లుగా చూపుతూ.. నిధులన్నీ ఖర్చు చేశారు. 

అప్పట్లో నిధులు..ఇప్పుడిలా..!

అయిదేళ్ల క్రితమే అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరైతే.. చాలా మున్సిపాలిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించ కపోవడంతో నిధులు అలాగే ఉండిపోయాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మిగిలిపోయిన నిధులను ఎలాగైన మార్చి 31లోగా వినియో గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళా ఆ నిధులు మురిగిపోయే (ల్యాప్స్) అవకాశం ఉండటంతో సంబంధిత పట్టణ స్థానిక సంస్థల జిల్లా ఉన్నతాధికారులు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడే కొన్ని మున్సిపాలిటీలకు మంచి అవకాశంగా మారింది. 

అచ్చంపేటలో కాంట్రాక్టర్ ఖాతాకు..!

అచ్చంపేట మున్సిపాలిటీ మెప్మాకు మంజూరైన నిధుల్లో రూ. 1,96,445 లను ఈ ఏడాది మార్చిలో ఓ కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేశారు. వాటిని 2024 మార్చి 31 నుంచి 2025 మార్చి 31 వరకు వీధి వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు మెఫ్మా అధికారులు నివేధికలు తయారు చేశారు. ఏడాది వ్యవధిలో ఆరు నెలల్లో నెలకు ఆరు రోజుల చొప్పున అవగాహన సదస్సులు నిర్వహించినట్లు చూపించారు.

అచ్చంపేట పట్టణం పరిధిలోని 1,482 మంది అవగాహన కల్పించి నట్లు చెబుతున్నారు. అందుకు ఒక్కో వీధి వ్యాపారికి అవగాహన సదస్సు సమయంలో టీ, స్నాక్స్ కోసం రూ. 30 చొప్పు నా ఖర్చు చేసినట్లు చూపించారు. అలాగే ప్రతీ మీటింగ్ సమయంలో టెంట్ కోసం రూ. 1,500 నుంచి 2 వేలు, బ్యానర్ కు రూ. వేయి, స్టేషనరీకి రూ. రూ. 250 నుంచి రూ. 350 వరకు, శిక్షణ అధికారులకు రూ. 3 వేలు, ల్యాప్ టాప్ అద్దె రూ. 500 చొప్పున ఖర్చు చేసినట్లు చూపించారు. ఇవన్నీ ఎలాంటి సదస్సులు లేకుండానే చూపించడం విడ్డూరం.

అచ్చంపేట మెఫ్మా పరిధిలో 453 మహిళా సంఘాలతో కూడిన 17 ఎస్‌ఎల్‌ఎఫ్ లు ఉన్నాయి. వాస్తవానికి మెఫ్మాకు మంజూరయ్యే నిధులన్నీ ఈ మహిళా సంఘాల ద్వారానే ఖర్చు చేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేశారు. ఎలాంటి సమా వేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించకుండానే ఈ నిధులు దారి మళ్లించడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది.

2021 నుంచి 2024 వరకు రూ. 3,03,551 ఖర్చు చేసినట్లు చూపించిన వాటిని మొక్కుబడి సమావేశాల పేరుతో స్వాహా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెప్మా నిర్వాహణను చూసే పీఆర్పీలు, మున్సిపాలిటీ అధికారులు కుమ్మకై నిధులను స్వాహా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నిధుల వినియోగంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే అక్రమాల చిట్టా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు

అచ్చంపేట మున్సిపాలిటీ మెఫ్మాకు మంజూరైన నిధుల్లో రూ. 1.96 లక్షలను కాంట్రాక్టర్ ఖాతాకు మళ్లించింది వాస్తవమే. మెఫ్మాకు వచ్చిన నిధులను 2026 మార్చి 31లోగా వినియోగించాలని జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పైగా నిధులను తప్పని సరిగా ఎవరైన కాంట్రాక్టర్ ఖాతాలోకి వేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే వాటిని తప్పని పరిస్థితుల్లో జమ చేశాము. ఇందులో ఎలాంటి దురుద్ధేశం లేదు.

డి.మురళి, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్