ప్రధాని మోదీకి మెటా క్షమాపణలు
ఆ వీడియో తొలగింపునకు సాంకేతిక సమస్యేనని వెల్లడి
మోదీ ఫేస్‌బుక్ వీడియోను పునరుద్ధరించిన మెటా
న్యూఢిల్లీ, జూలై 28: ప్రధాని నరేంద్రమోదీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియోను తొలగించిన వివాదంపై మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సోమవారం క్షమాపణలు చెప్పింది. మోదీ వీడియోను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదని, కేవలం సాంకేతిక కారణాల వల్ల అలా జరిగినట్లు మెటా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆ వీడియోను అందరికీ కనిపించేలా పునరుద్ధరించామని వెల్లడించింది.
నీట్- 2026 పరీక్షల అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు సుదీర్ఘ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నేపథ్యంలోనే జులై 23న ప్రధాని మోదీ మొదటిసారిగా నేరుగా (జెన్-జీ) యువతను ఉద్దేశించి ఫేస్‌బుక్ వేదికగా ప్రసంగించారు. ఆ ఫేస్‌బుక్ వీడియోలో పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇందుకోసం మరింత కఠినమైన చట్టపరమైన నిబంధనలను కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని వివరించారు.
అయితే ఫేస్‌బుక్ జూలై 28 తెల్లవారుజామున ఈ వీడియో యాక్సెస్‌ను కొద్దిసేపు నిలిపివేసింది. దీనితో మోదీ పెట్టిన వీడియో పోస్టు కనిపించకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోదీ పోస్టు ఎందుకు తొలగించారో చెప్పాలంటూ, మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌కు ఐటీ మంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది.
దీనితో దిగి వచ్చిన మెటా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. ‘ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను తమ ఆటోమేటెడ్ కంటెంట్ ఫిల్టర్లలోని సాంకేతిక లోపం కారణంగా తొలగించాం. ప్రస్తుతం దీనిని తిరిగి పునరుద్ధరించాం’ అని మెటా ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మెటా ఇచ్చిన వివరణ సమంజసంగా లేదని, దీనిపై లోతైన చర్చలు అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయం ఇంకా ‘పరిష్కారం కాలేదు’ అని కూడా పేర్కొన్నాయి.






