29 July, 2026 | 1:08 AM

భూ భాగస్వామ్యం!

29-07-2026 12:07 AM
  1. అధికార, ప్రతిపక్ష పార్టీలు బయట వైరం... లోపల బేరం
  2. మోకిల అసైన్డ్ భూమిపై రెండు పార్టీల నాయకుల కన్ను
  3. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు నక్కజిత్తులు
  4. అధికారుల సహకారంతోనే ఆక్రమణలు? 

రంగారెడ్డి /శంకరపల్లి, జూలై 28(విజయ క్రాంతి):బయటి ప్రపంచానికి ఆ రెండు పా ర్టీల నాయకులు పిల్లీ-ఎలుకలా కొట్టుకుంటా రు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు విసురుకుంటారు. కానీ, కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కనిపించేసరికి మాత్రం ‘చెట్టపట్టాల్’ వేసుకొని ఒక్కటైపోయారు! శంకరపల్లి మండలం మోకిల గ్రామంలో వెలుగుచూసిన ఈ విస్తుపోయే నిజం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

రూ. కోట్లలో విలువ..కన్నుపడ్డ కబ్జాదారులు

మోకిల గ్రామంలోని సర్వే నంబర్ 31లో సుమారు 2.20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రీజినల్ రింగ్ రోడ్డుకు  అనుసంధానంగా నిర్మిస్తున్న 100 అడుగుల రేడియల్ రోడ్డుకు సరిగ్గా ఆనుకొని ఉండటంతో, ఈ ల్యాండ్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. కోట్లు పలుకుతోంది.

గ్రామాభివృద్ధికి, ప్రజల ఉమ్మడి అవసరాలకు ఈ స్థలాన్ని కేటాయించాలని మోకిల గ్రామస్తులు ఎప్పటినుంచో పోరాడుతున్నారు. గతంలో ఉన్న పంచాయతీ పాలకవర్గం కూడా ఇదే విషయమై తీర్మానం చేసి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించింది. ఇటీవల కూడా మరోసారి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

షాడో సర్పంచ్ హస్తం..

అయితే, ఈ విలువైన భూమిపై కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు స్థానిక నాయకుల కన్ను పడింది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, భూమిని అప్పనంగా కొట్టేసేందుకు ఇరు పార్టీల నేతలు రహస్య డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఒక ‘షాడో సర్పంచ్’ కూడా ఈ భూ దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

భూమిని వదులుకునేది లేదంటూ ఈ నాయకులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అధికారుల పాత్రపై అనుమానాలుఅసైన్డ్ భూములను అక్రమణదారుల నుంచి కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారుల పరోక్ష సహకారం వల్లే ఈ ‘భూ బకాసురులు’ ఇంతగా తెగబడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

గ్రామస్తుల  డిమాండ్:

‘ఇది ప్రజల ఆస్తి. రాజకీయ నాయకుల అక్రమ సంపాదనకు బలికావడానికి వీల్లేదు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి ఈ అసైన్డ్ భూమిని కాపాడాలి.గ్రామానికి కేటాయించి ప్రజా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. బయట శత్రువులుగా నటిస్తూ లోపల కలిసి భూములను కాజేస్తున్న ఈ నాయకుల నైజం చూసి ఇతర రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు అసైన్డ్ భూమి కబ్జా వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.