29 July, 2026 | 1:45 AM

కీచక డ్రైవర్లు!

29-07-2026 12:51 AM
  1. ప్రైవేట్ స్కూల్ వ్యాన్లలో పిల్లలపై దాష్టీకాలు
  2. వెకిలిచేష్టలు, అసభ్య ప్రవర్తనలు 
  3. చిన్నారుల్లో మానసిక ఆందోళనలు, భయాలు
  4. నిబంధనలకు విరుద్ధంగా వ్యాన్లు, బస్సులు
  5. అడ్డదిడ్డంగా డ్రైవింగ్.. పసివాళ్ల ప్రాణాలకు ముప్పు  

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల వ్యాన్లు, బస్సులు, ఇతర వాహనాలు పిల్లలపై డ్రైవర్ల దాష్టీకాలకు మౌన సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. అడ్డదిడ్డంగా నడిపే డ్రైవర్ల కారణంగా పసివాళ్ల ప్రాణాలు ప్రమాదాల్లో పడుతున్నాయి. అభంశుభం తెలియని చిన్న పిల్లలు కొన్నిసార్లు డ్రైవర్లు చేసే వెకిలిచేష్టలు, అసభ్యంగా ప్రవర్తనలు పిల్లల్లో మానసిక ఆందోళనలకు, భయానికి కారణమవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతున్న వ్యాన్లు, బస్సులు, ఆటోలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికిమించి చిన్నారులను తీసుకెళుతున్నారు. ఎప్పుడు ప్రమాదం వాటిల్లుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాన్లు, మినీ వ్యాన్లలో 8 నుంచి 10 మంది పిల్లలకే అవకాశం ఉన్నప్పటికీ.. 15 నుంచి 20 మందిని ఎక్కించి కుక్కి తీసుకెళ్తున్నారు.

డ్రైవింగు సీటు పక్కనే.. కొన్నిసార్లు డ్రైవింగు సీట్లపైనకూడా చిన్నారులను కూర్చుండబెట్టి డ్రైవర్లు తీసుకెళ్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా నడపడం డ్రైవర్లకు అలవాటుగా మారింది. వ్యాన్లు, బస్సుల్లో సీసీ టీవీ కెమెరాలు, ప్రాథమిక చికిత్స బాక్స్‌లు ఉండటం లేదు. సమయానికి చేరుకోవాలనే నెపంతో రాంగ్‌రూట్లలో, తప్పుడు మార్గంలో ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

పర్యవేక్షణ కరువు.. కఠిన శిక్షలు లేవు

ప్రైవేటు స్కూల్ వ్యాన్లు, బస్సుల్లో పర్యవేక్షణ కొరవడుతోంది. దీనితో పిల్లల పట్ల డ్రైవర్లు, ఇతర సిబ్బంది వ్యవహరించే తీరు బయటకు రావడం లేదు. ఆయా స్కూలు యాజమాన్యాలు ప్రైవేటు వ్యాన్లు, మినీ వ్యాన్లు, ఆటోలు, బస్సుల బాధ్యత తీసుకోవడం లేదు. అందులో శిక్షణ పొందిన డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఉండటం లేదు. ఆయాలు, సీసీ టీవీ కెమెరాలు, నిరంతర పర్యవేక్షణ అత్యవసరం.

చిన్నారులను తీసుకెళ్లే వ్యాన్లు, ఆటోలు, మినీ వ్యాన్లు, బస్సులపై అటు రవాణా శాఖగానీ, ఇటు పోలీసు శాఖగానీ దృష్టి సారించడం లేదు. పలు సందర్భాల్లో తాగి డ్రైవింగు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జూలై 2న సెంట్రల్ జోన్ ట్రాఫిక్ విభాగం పోలీసులు స్కూలు వ్యాన్లు, బస్సులు, ఆటోలను తనిఖీ చేశారు. ఆ ఒక్కరోజే 154 వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నట్టు పోలీసులు పట్టుకుని 137 కేసులు నమోదు చేశారు.

ఇందులో ఒక డ్రైవర్ ఏకంగా తాగి వాహనాన్ని నడిపిస్తున్నట్టుగా తేలింది. సదరు డ్రైవర్‌కు బ్రీత్ అనలైజింగ్ టెస్టు చేయగా.. 181 ఎంజీ/డీఎల్ గా రావడంతో పోలీసులుకూడా ఆశ్చర్యపోయారు. రవాణా శాఖ కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదు. బస్సులు, ఆటోలు, వ్యాన్లు, మినీ వాన్లు ఫిట్‌నెస్‌తో ఉన్నాయా? కాలం చెల్లినవా.. డ్రైవర్‌కు అర్హతలున్నాయా. నిబంధనల ప్రకారం వాహనం ఉందా అనేది తేలుతుంది. దీనితోపాటు స్కూలు వాహనాల్లో సీసీటీవీ కెమెరాలు, సిబ్బంది, ఆయాలు ఉన్నారా అనేదికూడా తేలుతుంది.

పైగా స్కూలు యాజమాన్యాల పరిధిలోనే ఉన్నాయా.. లేక ప్రైవేటుగా మాట్లాడుకుని పిల్లలను తీసుకొస్తున్నారా అనేదానిపై దృష్టి సారించాలి. అటు విద్యాశాఖకూడా కఠినంగా వ్యవహరించాలి. ఎలాంటి సంఘటన జరిగినా స్కూలు యాజమాన్యాన్ని బాధ్యులుగా చేయాలి. స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. పిల్లలపై దాష్టికాలకు పాల్పడినవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే కఠిన చట్టాలు తీసుకురావాలి.

చిన్న పిల్లలకు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో ఉపాధ్యాయులు స్పష్టంగా తెలిసేలా చెప్పాలి. అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లలను తీసుకొచ్చే వాహనాలపై పర్యవేక్షిస్తుండాలి. పిల్లల్లో మానసిక సమస్యలను గుర్తించి.. వారికి భరోసా కల్పిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తాయి. 

పిల్లలతో అసభ్యకర ప్రవర్తన

4 నుంచి పదేండ్ల వయస్సున్న చిన్న పిల్లల పట్ల కొందరు డ్రైవర్లు కీచకులుగా మారుతున్నారు. వారు లక్ష్యంగా చేసుకున్న చిన్నారులకు ప్రత్యేక సీట్లు కేటయించడం, ప్రత్యేకంగా చూడటంతో చిన్నారులు వారి చేష్టల వెనుక ఆంతర్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యకరంగా పిల్లల శరీర భాగాలను స్పర్షించడం, ఎవరికన్నా చెబితే చంపేస్తాం, తల్లిదండ్రులకు హాని తలపెడతామనే హెచ్చరికలతో చిన్న పిల్లలు మానసికంగా కుమిలిపోతున్నారు.

అసలు ఏం జరుగుతుందనేదికూడా వారికి అర్థం కాకపోవడంతో.. ఒంటిరివారవుతున్నారు. భయంతో ఏం జరుగుతుందనేది తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారు. కొందరు పిల్లలకు ఏం జరుగుతుందో అర్థం అవుతున్నా.. బయటకు చెప్పలేకపోతున్నారు. కొన్నిసార్లు పిల్లలు జరుగుతున్న విషయాలను తల్లిదండ్రులకు చెప్పినా.. సమాజంలో ఎక్కడ చిన్నచూపు చూస్తారోననే భయంతో వారుకూడా నోరుమెదపలేకపోతుండటం గమనార్హం. చాలా తక్కువ కేసులు పోలీసు స్టేషన్ల వరకు వెళుతున్నాయి.

పోలీసు స్టేషన్‌కు వచ్చిన కేసుల్లోనూ.. చాలా వరకు పోలీసుల అత్యుత్సాహం, సరైన సాక్ష్యాలను సేకరించడం, సాక్ష్యాల సేకరణలో నిర్లిప్తత, అవినీతి కారణంగా కోర్టులు కూడా పిల్లల హక్కులను కాపాడటంలో, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఇలాంటి సంఘటనలకు పాల్పడిన డ్రైవర్లకు శిక్షలు కూడా కఠినంగా ఉండకపోవడంతో కొద్ది కాలానికే నేరస్తులు బయటి సమాజంలో యధేచ్చంగా తిరుగుతున్నారు.