హైడ్రాను రద్దుచేస్తాం
- హైకోర్టు మందలించినా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు
- డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి
- ఢిల్లీలో మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి
- కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతి
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్, బెదిరింపు రాజకీయాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించిందని, న్యాయస్థానం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అతిపెద్ద బ్లాక్ మెయిలర్‌లలో ఒకరని, సీఎం కుటుంబ సభ్యులు, మంత్రుల అక్రమ నిర్మాణాలపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు.
నిషేధిత భూము ల విస్తీర్ణం బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉంటే, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని కేటీఆర్ ఆరోపించా రు. కమీషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రా ను రద్దు చేస్తామన్నారు. భారత్‌లో కూడా జెన్‌జీ ఉద్యమాలు జరిగే అవకాశముందన్నారు. పేపర్ లీకుకు సంబం ధించి కొత్త బిల్లులు తెచ్చే ముందు గత తప్పుల నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుం దో ప్రజలకు చెప్పాలన్నారు.
మంగళవా రం ఢిల్లీలో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. చట్టం అందరికీ సమా నమైతే ముందుగా సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, అధికార పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎ. తిరుపతిరెడ్డికి సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిర్మాణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకోవడం న్యాయం కాదన్నారు. హైడ్రా చర్యల్లో పారదర్శకత, సమానత్వం ఉండాలని, అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం ఉండకూడదని, ఎంపిక చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరికాదని కేటీఆర్ విమర్శించారు.
హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో వేలాది ఇండ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని, దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, సామాన్య ప్రజల ఇండ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతిలో బ్లాక్‌మెయిలింగ్ సాధనంగా మారిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఆస్తులను గణనీయంగా పెంచాం..
గత ప్రభుత్వ బకాయిలు కొత్త ప్రభుత్వానికి రావడం సహజమేనని, ఆస్తులతో పాటు అప్పులు కూడా సంక్రమిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర నెలవారీ ఆదాయం సుమారు రూ.4,000 కోట్లు ఉండగా, తమ పాలన ముగిసే నాటికి అది సుమారు రూ.18,500 కోట్లకు పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ఆస్తులను గణనీయంగా పెంచామని, అభివృద్ధి కోసం కొంత అప్పు కూడా పెరిగిందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే 75 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయ్యాయని తెలిపారు. గత ఒప్పందం ప్రకారం తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన సుమారు రూ.400 కోట్ల నిధులను విడుదల చేయాలని గవర్నర్ ద్వారా కూడా కోరినట్లు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విద్యార్థులు, ప్రజలకు బకాయిల కారణంగా ఇబ్బందులు కలిగించలేదన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు..
డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ కోరారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలను శిక్షించి, జనాభా పెంచిన రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా డీలిమిటేషన్ ఉండకూడదన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయని, డీలిమిటేషన్ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, సీనియర్ నాయకులు కలిసి చర్చించి ఉమ్మడి వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యసభ, లోక్‌సభలో బీఆర్‌ఎస్ తన వైఖరిని తగిన సమయంలో వెల్లడిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ స్థానాలు పెంచాలని చట్టంలో ఉన్నప్పటికీ, 12 ఏళ్లుగా అమలు కాలేదని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిందని, దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజకీయ గందరగోళం సృష్టించారని విమర్శించారు.
పేపర్ లీక్‌ల నియంత్రణకు బిల్లు తీసుకొస్తే స్వాగతిస్తాం..
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఐదుసార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, అందులో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మూడు సార్లు జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. దేశానికి ఇప్పుడు జవాబుదారీతనం, పారదర్శకత, దీర్ఘకాలిక సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్‌ఎస్ స్వాగతిస్తుందని, మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
డా. కే. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని, అలాగే నందన్ నీలేకని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. నీట్ అంశం కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమేనని, అంతకుముందే విద్య, ఉపాధి తదితర రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువతలో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయిందన్నారు. భారత్‌లో కూడా నేపాల్ తరహా జెన్ జీ ఉద్యమాలు జరిగే అవకాశం ఉందని, యువత మనోభావాలను నిర్లక్ష్యం చేస్తే అలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు.
మనోహరాబాద్ రైల్వే లైన్‌ను త్వరగా పూర్తిచేయాలి..
సిరిసిల్ల నియోజకవర్గానికి కీలకమైన 151 కిలో మీటర్ల మనోహరాబాద్--, కొత్తపల్లి న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 76 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తై 2023 అక్టోబర్ 3న ప్రారంభమయ్యాయని, మిగిలిన సిద్దిపేట మార్గంలో పనులు మందగించాయన్నారు. ప్రాజెక్టు ఆలస్యంతో అంచనా వ్యయం రూ.1,160 కోట్ల నుంచి రూ.2,780 కోట్లకు పెరిగిందన్నారు.
ఈ రైల్వే లైన్ సిరిసిల్ల టెక్స్‌టైల్ పరిశ్రమతో పాటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని, మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జికి ఆమోదం తెలపాలని కోరినట్లు కేటీఆర్ చెప్పారు.
టియర్-2 ఐటీ నగరాల అభివృద్ధికి సహకరించండి..
తెలంగాణలో టియర్-2 ఐటీ నగరాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని కేటీఆర్ కోరారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే ప్రయత్నం చేసిందని తెలిపారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని, వరంగల్‌లో ప్రముఖ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడం టియర్-2 ఐటీ మోడల్ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అయితే ఇటీవల జిల్లాల్లో ఐటీ విస్తరణ మందగించడం, ఆక్యుపెన్సీ తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో టియర్-2 ఐటీ ఎకోసిస్టమ్ పునరుద్ధరణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఏఐ డేటా ల్యాబ్, కరీంనగర్ లేదా ఖమ్మంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డీప్ టెక్ రంగాలపై దష్టి సారించే ఎస్‌టీపీఐ సెంటర్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
రైల్వే మంత్రితో కేటీఆర్ భేటీ..
రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన కీలక అంశాలను కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, పార్టీ సీనియర్ నేత జాన్సన్ నాయక్‌లతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్.. తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రం అందజేశారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, ఈ డివిజన్‌లో కాజీపేట--పెద్దపల్లి, కాజీపేట--డోర్నకల్, మోతమర్రి తదితర రైల్వే సెక్షన్లను చేర్చాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ డివిజన్ పరిధి సుమారు 2 వేల ట్రాక్ కిలోమీటర్ల వరకు ఉంటుందని వివరించారు.
కేవలం 900 కిలో మీటర్లతో గుంటూరు డివిజన్, సుమారు 2,200 కిలో మీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్లు కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు పరిపాలనా, అభివృద్ధి పరంగా ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగులు కూడా కాజీపేట డివిజన్ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.






