29 July, 2026 | 1:45 AM

లోక్‌సభలో పరీక్షా పే చర్చా! లీకులపై లడాయి

29-07-2026 12:59 AM

పెల్లెట్ గన్స్ వాడాలని ఎవరు ఆదేశించారు: ప్రియాంక

విద్యార్థులు వీధుల్లో ఉంటే మోదీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేశారు: గౌరవ్ గొగోయ్ 

రామ మందిర విరాళాలు దొంగిలించిన వారు పేపర్ లీక్‌లను ఆపలేరు: అఖిలేష్

న్యూఢిల్లీ, జూలై 28 : నీట్ ప్రశ్నాపత్రం లీక్.. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడటం.. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన పేపర్ లీక్ వ్యతిరేక బిల్లు (పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్ట సవరణ)పై మంగళవారం లోక్ సభలో చర్చ వాడీవేడిగా ప్రారంభమైంది. 10 గంటల పాటు చర్చకు సిద్ధంగా ఉన్న ట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఈ చట్టాన్ని ముందుగా ఎన్డీఏ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, స్వతంత్ర భారత దేశంలో ఇది బహుశా మొట్టమొదటిది అని అన్నారు. ఈ బిల్లు భారత పార్లమెంట్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో నిబంధనలు రూపొందించామని.. దోషులకు శిక్షలను పదేళ్లకు పెంచామని చెప్పారు.

లీకేజీ గ్యాంగ్లకు జరిమానాను రూ. కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచామని.. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో చాలా పేపర్లు లీక్ అయ్యాయన్నారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.. పరీక్షా పత్రాల పేపర్ లీక్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అన్నారు.

రెండేళ్ల క్రితం అసలు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, విద్యా రంగాన్ని బలోపేతం చేసే, పేపర్ లీక్‌లను అరికట్టే చారిత్రాత్మక చర్యగా ప్రభుత్వం దానిని అభివర్ణించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపాదించిన సవరణలు కేవలం కంటితుడుపు చర్య అని విమర్శించారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. మోదీ మాత్రం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కూర్చున్నారని విమర్శించారు. సోమవారం బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంట్‌లో ఘన స్వాగతం పలకడాన్ని ఆయన తప్పుపట్టారు.

తర్వాత మాట్లాడిన బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పిలుపునిచ్చినప్పుడు పంజాబ్ విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేశారా అని గగోయ్‌ను ప్రశ్నించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడం ద్వారా ప్రభుత్వం ప్రధానిని కాపాడిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తమ డిమాండ్లను అంగీకరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన జెన్ జీని ఆయన ప్రశంసించారు.

జవాబుదారీతనం అంటే అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను నింపగల సామర్థ్యమని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. రామ మందిర విరాళాల డబ్బును దొంగిలించిన వారు పేపర్ లీక్‌లను ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వెనుకబడినవర్గాల విద్యాహక్కులను దొంగిలించిందని, దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాఠశాలలను మూసివేసిందని ఆరోపించారు. 

పోలీసుల తీరు సరికాదు: ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ, ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగించడాన్ని, లాఠీఛార్జి చేయడాన్ని తప్పుబట్టారు. ఆయుధాలు ప్రయోగించడానికి వారేమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. నిరసనకారులపై పెల్లెట్ గన్స్, బాష్పవాయు గోళాలు, లాఠీచార్జ్, వాటర్ క్యానన్లను ఉపయోగించాలని ఆదేశించింది ఎవరో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

దేశ యువత తమ ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటుండగా.. వారిపై దాడి చేయడం సరైన చర్య కాదన్నారు. విద్యార్థుల నిరసనను ఆయుధాలతో అణచివేయాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీక్‌ల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీని ఈ దేశ మహిళలు అంగీకరించరని అన్నారు.