17 July, 2026 | 3:49 AM

రోడ్డున పడ్డ వలసజీవులు

23-06-2024 12:05 AM
  1. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న గుడిసెల తొలగింపు

బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, జూన్ 22 : విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులతో వలసజీవుల బతుకులు రోడ్డున పడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ పనులతో శుక్రవారం రాత్రి నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, పోలీసులు బృందాలుగా ఏర్పడి హయత్‌నగర్ రేడియో స్టేషన్ పక్కన గల వినాయక విగ్రహాల తయారీదారులకు చెందిన 75 గుడిసెలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు.

అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. 75 కుటుంబాలు ఇక్కడ అనేక ఏండ్లుగా నివసిస్తున్నాయని, వారికి ఆధారం చూపకుండా ఎలా గుడిసెలు తొలిగిస్తారని ప్రశ్నించారు. వినాయక విగ్రహాలు తయారీ చేసే వారిని వినాయక చవితి ముగిసేవరకు ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు అధికారులు ఒప్పకోవడంతో సమస్య సద్ధుమణిగింది. మాజీ కార్పొరేటర్లు సామ తిరుమల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు నక్క రవీందర్‌గౌడ్, చెన్నగొని శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.