9 May, 2026 | 4:31 PM

డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఐదుగురు కస్టమర్ల అరెస్టు

23-06-2024 12:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): మాదాపూర్‌లో ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయిచరణ్ అనే పాత నేరస్థుడు బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ద్వారా హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి లలో ఉన్న వ్యాపారవేత్తలకు సరఫరా చేస్తున్నాడు. ఇతని కస్టమర్లలో నగరానికి చెందిన సుమారు 50 మంది వ్యాపారవేత్తలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తీసుకొస్తున్న సాయిచరణ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లకు ఇస్తున్న సాయిచరణ్, వాటిని కోడ్ భాష ద్వారా కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. సాయిచరణ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలు మాలిక్, లోకేశ్, సందీప్‌రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంతో పాటు సాయిచరణ్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

డ్రగ్స్, గంజాయి పట్టివేత

నగరంలోని వేర్వేరు చోట్ల నిర్వహించిన దాడుల్లో రూ. 7.35 లక్షల విలువైన గంజా యి, డ్రగ్స్‌ను స్వాధీ నం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ హైదరా బాద్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఏ అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఓ వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్న భరత్‌సాయి అనే వ్యక్తిని ఎక్సైజ్ సీఐ మహేశ్, ఎస్సై రూప పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద పట్టుకొని అతని నుంచి రూ. 1.10 లక్షల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సీఐ చంద్రశేఖర్, ఎస్సై భూపాల్ కలిసి ధూల్‌పేటలో నిర్వహించిన దాడుల్లో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని పట్టుకున్నారు. గంజాయి విలువ రూ.6.25 లక్షలు ఉంటుందని చెప్పారు.