జిల్లెళ్లు మొలుస్తున్నాయి
- చేవెళ్ల మినీ స్టేడియంకు గ్రహణం!
- రూ. 50 లక్షల ఎంపీ నిధులు బూడిదలో పోసిన పన్నీరేనా?
- మెయింటెనెన్స్ శూన్యం..
- పిచ్చిమొక్కలు, విషసర్పాల మధ్యే క్రీడాకారుల సాధన
చేవెళ్ల, ఏప్రిల్ 24(విజయక్రాంతి): క్రీడాకారుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన స్టేడియం.. నేడు అడవిని తలపిస్తోంది. యువతకు ఉత్సాహాన్నివ్వాల్సిన మైదానం.. ముళ్ల పొదలు, జిల్లేడు చెట్లతో నిండిపోయి భయాన్ని గొల్పుతోంది. నియోజకవర్గ కేంద్రమైన చేవెళ్లలో నిర్మించిన మినీ స్టేడియం అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని 12 గ్రామాలు, 18 వార్డులకు చెందిన సుమారు 50 వేల మంది జనాభా ప్రయోజనం కోసం 2023లో అప్పటి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి రూ. 50 లక్షల సొంత నిధులతో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్ నెట్స్, వాలీబాల్, షటిల్ కోర్టులతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ స్టేడియం, మూడేళ్లు కూడా గడవకముందే దయనీయ స్థితికి చేరుకుంది.
శిథిలావస్థలో సౌకర్యాలు..
స్టేడియం దుస్థితి చూస్తుంటే ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం అవుతుందో అర్థమవుతోంది. రక్షణగా ఉండాల్సిన ఉత్తర భాగం గోడ కూలిపోయి ఎవరైనా లోపలికి వచ్చేలా తయారైంది. నిర్వహణ లేకపోవడంతో ఆకతాయిలు స్త్వ్రరవిహారం చేస్తున్నారు. స్టేడియం గదుల తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు.క్రీడాకారుల దాహార్తి తీర్చడానికి, గార్డెన్ నిర్వహణకు వేసిన బోరుబావి నేడు నిరుపయోగంగా పడి ఉంది.ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ ముందు పిచ్చి మొక్కలు పెరగడంతో, అక్కడ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది.
విషసర్పాల భయంలో క్రీడాకారులు..
స్టేడియానికి వస్తున్నామా లేక అడవికి వెళ్తున్నామా?‘ అని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకే ప్రాక్టీస్ కోసం వచ్చే యువకులు, ఏ పొదలో నుంచి ఏ విషసర్పం వస్తుందోనని వణికిపోతున్నారు. స్టేడియం నిండా జిల్లేడు చెట్లు, ముళ్ల పొదలు పేరుకుపోవడంతో క్రీడా మైదానం కాస్తా కంచెలా మారిపోయింది.
అధికారుల ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వైఖరి..
ఇంత జరుగుతున్నా మున్సిపల్ యంత్రాంగం కానీ, క్రీడల శాఖ అధికారులు కానీపట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన ఆస్తులు కళ్లముందే నాశనమవుతున్నా కనీసం పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే స్టేడియంలోని పిచ్చి మొక్కలను తొలగించి, కూలిపోయిన ప్రహరీని పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. బోరుబావిని పునరుద్ధరించి, స్టేడియంకు పూర్వవైభవం తీసుకురావాలని క్రీడాకారులు వేడుకుంటున్నారు.






