18 March, 2026 | 2:48 AM

చందిప్ప ‘మరకత’ శివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు

18-03-2026 01:18 AM

శంకర్ పల్లి, మార్చి 17 (విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన అత్యంత అరుదైన ఆకుపచ్చ మరకత శివలింగానికి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు.

ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక ప్రశాంతత..

పూజ అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆకుపచ్చని మరకత శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయని, అటువంటి మహిమాన్విత లింగం మన ప్రాంతంలో ఉండటం విశేషమని పేర్కొన్నారు. చందిప్ప శివాలయం పచ్చటి పంట పొలాల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని, ఇక్కడ పూజలు చేయడం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆలయాల అభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, మంత్రిని కండువాతో సన్మానించి, జ్ఞాపికగా మరకత శివలింగం చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హనుమంతు, ప్రభు మరియు స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.