18 March, 2026 | 5:33 AM

అన్నింటా మీరు అట్టర్ ఫ్లాప్

18-03-2026 01:19 AM
  1. ప్రభుత్వ పాలన అంటే యజ్ఞం
  2. నిధుల కోసం ఎన్నిసార్లునా ఢిల్లీకి వెళ్తాం
  3. ఎంఓయూల్లో 30 నుంచి 40శాతం మాత్రమే గ్రౌండ్ అవుతాయి
  4. మహిళా సాధికారతపై హేళనగా మాట్లాడటం మంచిది కాదు
  5. అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

అభివృద్ధి, సంక్షేమం కోసం మేం తలొగ్గి అయినా పనిచేస్తాం

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ప్లాప్ సినిమా అంటున్న బీఆర్‌ఎస్, అన్నింటా అట్టర్ ప్లాప్ అయిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్లాప్ అయింది మీరు కాదా అని బీఆర్‌ఎస్ నాయకులపై సెటైర్ వేశారు. ఇన్నిసార్లు ప్లాప్ అయిన మీరు మమ్మల్ని ప్లాప్ అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇకనైనా పంథా మార్చుకుని వాస్తవాలు మాట్లాడితే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా కనీసం ప్లాప్ నుంచి తప్పించుకుని కాస్త మెరుగుపడే అవకాశం ఉందన్నారు. కానీ, వింటున్నామని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం అంటే యజ్ఞమని కేటీఆర్ ఇప్పు టికైనా గుర్తించారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల తీసుకువచ్చేందుకు ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తామని, ఎన్ని సార్లైనా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

మంగళ వారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. మాది జాతీయ పార్టీ అని ఢిల్లీ నుంచే రాజకీయం ఉంటుందన్నారు. ప్రాంతీయ పార్టీ మీరు పదేళ్లు అధికారంలో ఉండగా అధికారం కాపాడుకునేందుకు మీరు ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లలేదా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి కేటీఆర్ ఏదైనా సల హాలు, సూచనలు ఇస్తారనుకుంటే అదే ఊక దంపుడు ఉపన్యాసాలు, ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను ఇక్కడ చదివి వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల గురించి ఢిల్లీకి వెళ్లకుండా జిడ్డు రాజకీయం చేయాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం మేము ఓ మెట్టు దిగైనా, తలొగ్గి అయి నా ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్రం ఇస్తుం దా లేదా అది వారి ఇష్టం.. కానీ మా ప్రయ త్నం కొనసాగిస్తామన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ ఉద్యోగాల సంఖ్యకు సంబంధించిన అస్పష్టతపై పరిశీలిస్తామని తెలిపారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించామని గుర్తు చేశారు. కాలుష్యం లేని నగరంగా మార్చించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం చేసుకున్న ఎంఓ యూల్లో 30 నుంచి 40 శాతం మాత్రమే గ్రౌం డ్ అవుతాయన్నారు. మహిళా సాధికారతపై హేళనగా మాట్లాడటం మంచిది కాదని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

గ్రామీణ మహిళల్లో నమ్మకం కల్పిస్తున్న సమయంలో కేటీఆర్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. మహిళలకు కావాల్సిన అన్ని  వనరులను సమకూరుస్తూ వారి సాధికారత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మార్కెటింగ్ చేసుకోవడంలో బీఆర్‌ఎస్ వాళ్లకు వారే సాటి అని ఎద్దేవా చేశారు. కానీ వారి గోబెల్స్ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ నాయకులు ఇక్కడ ఉండేవారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారిశ్రామి కాభివృద్ధి కోసం కంటిన్యూటి పాలసీ అవసరమని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వచ్చినా పాలసీ మారదనే నమ్మకం కలిగించే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో మీరు చేసిన దానికి వంద రేట్లు చేయాలనుకోవడం కూడా తప్పా అని ప్రశ్నించారు.