14 July, 2026 | 9:35 AM

సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన

14-07-2026 08:49 AM
  1. రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధుల మంజూరు
  2. ప్రాజెక్టులు పూర్తయితే పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు
  3. జోగులాంబ గద్వాల జిల్లాలో రూ. 339 కోట్ల నిధులతో హామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
  4. 25 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం గర్వకారణమనం: మంత్రి జూపల్లి 
  5. జిల్లాలోని రోడ్లకు మహర్దశ.... గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, (విజయక్రాంతి) : సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోందని రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం ధరూర్ మండల కేంద్రంలో జోగులాంబ జిల్లా వ్యాప్తంగా వివిధ రహదారుల విస్తరణ,  మరమ్మత్తుల నిర్మాణానికి రూ.339.39 కోట్ల నిధులతో చేపట్టిన హామ్ రోడ్ల పనులకు మంత్రి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 25 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం గర్వకారణమని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 15 టీఎంసీలకు పెంచడం ద్వారా కరువు పరిస్థితుల్లోనూ తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. మహిళా, రైతు, యువజన సంఘాలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని రోడ్లకు మహర్దశ.... గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

జిల్లాలోని రోడ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం హామ్ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గతంలోనూ మంత్రి జూపల్లి సహకారంతో గద్వాల నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ రహదారుల నిర్మాణానికి రూ .40 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. గద్వాల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను సందర్శించి దాని సామర్ధ్యాన్ని 15 టిఎంసిలకు పెంచేందుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

అంతకుముందు ధరూర్ కు చేరుకున్న మంత్రులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి, శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత, వాల్మీకి బోయ కార్పోరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ ప్రగతి, డిఈ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.