భేషజాల్లేవు
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి
- రాష్ట్ర అభివృద్ధే ధ్యేయం
- మన ప్రయోజనాలను సాధించే లక్ష్యంగా పనిచేయాలి
- ప్రాజెక్టులు, రవాణా వసతులకు అవసరమైన అనుమతులు సాధించాలి
- ప్రధాని, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయండి
- పార్టీలకు అతీతంగా సమాచారం అందజేస్తాం
- అఖిలపక్ష ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
- కాంగ్రెస్ ఎంపీలతోపాటు హాజరైన బీజేపీ ఎంపీలు ఈటల, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- తెలంగాణ వాటాను సాధించుకుందాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తమకు ఎలాంటి భేషజాలు లేవని, రాష్ట్రా భివృద్ధే ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఆయన ఎంపీలకు దిశా నిర్దే శం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అను మతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎంపీలకు సోమవారం ప్రజాభవ న్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ జనాభాలో 10 శాతం జనాభా ఆరు మహా నగరాల్లో ఉందని, అయితే ఈ నగరాలు 25 శాతం జీడీపీ కలిగి ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, మెట్రో ఫేజ్--2 విస్తరణకు సంబం ధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని వివరించారు. ఇందుకు సంబంధించి ఎస్బీఐ క్యాప్‌ని కన్సల్టెంట్‌గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలన్నారు.
ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని.. ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్ భూ సేకర ణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని.. ఈ విషయంలో ఎంపీలు శ్రద్ధ పెట్టాలని సూచించారు.
మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచ్చిందని, ఈ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అనుమతి లేఖ కోసం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు.
నదీ జలాలపై శ్రద్ధ పెట్టాలి
అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక సీఎంలతో చర్చించిన అంశా లను ఎంపీలకు సీఎం రేవంత్ వివరించారు. తుం గభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావల్సి ఉన్నా పూడికతో 5 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. డ్యామ్‌తో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని సీఆర్ పాటిల్‌ను కోరామని, ఈ విషయంపైనా ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సీఎం సూచించారు.
నదుల అనుసంధా నంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 300 టీఎంసీల వాటా ఉందని, వాటిని ఛత్తీస్‌గఢ్ వాడుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయన్నారు. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు.
గోదావరి నుంచి ఏపీ ప్రాంతం మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు నీరు తీసుకెళ్లే గోదావరి-కావేరి అనుసంధానం ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్గఢ్ వి అయితే నిధులు కేంద్రానివని... ఆ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని సీఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారం భించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉందని తెలిపారు.
ఈ విషయంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చర్చించామన్నారు. వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్వోసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సీఎం అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150--151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ఎంపీలతో సీఎం అన్నారు.
ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ ఎయిపోర్ట్‌లకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశామని సీఎం తెలిపా రు. ఈ ఎయిర్పోర్టుల్లో ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్), ఎయిర్ కార్గోలు ఏర్పాటుచేయాలని కోరుతున్నామని.. ఈవిషయంపైనా ఎంపీలు దృష్టిసారించాలని సీఎం కోరారు.
ఎంపీల ప్రశ్నలు.. సమస్యలు
గద్వాల దగ్గర మూతపడిన ఆయిల్ మిల్లు పునరుద్ధరణపై ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులను ప్రశ్నించారు. 7-8 నెలల్లో పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటుచేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి తగిన మిల్లింగ్ సామర్థ్యం లేదని, స్టోరేజీ సమస్య ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంపీలంతా స్టాండింగ్ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారని, ఆ సమాచారం తీసుకొని ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్ విషయాలు తెలియజేస్తే సమా వేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని.. ఈ అంశంపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
ఎలాంటి భేషజాలు లేకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన వాటాలను, నిధులను సాధ్యమైనంత వరకు సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎంపీలు అందించిన ప్రతి సలహాను, సూచనను ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు నోట్ చేసుకున్నారని, వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వివిధ శాఖల సెక్రెటరీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం రాసే ప్రతి లేఖ ప్రతులను తప్పనిసరిగా తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రెటరీకి పంపాలని ఆయన చెప్పారు. గతంలో పంపిన లేఖలు, భవిష్యత్తులో పంపే ఉత్తరాలు, పెండింగ్ అంశాలన్నింటినీ శాఖల వారీగా క్రోడీకరించి ఒక స్పష్టమైన డ్రాఫ్ట్ తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందజేస్తారు.. దీని ద్వారా ఎంపీలు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు తక్షణ సమాచారం, సహకారం అందించడం కోసం తెలంగాణ భవన్‌లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక టీమ్‌ను అందుబాటులో ఉంచుతుందని ప్రకటించారు.
భవిష్యత్తులో పార్లమెంట్ నోటిఫికేషన్ రాగానే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామని, తద్వారా క్వశ్చన్ అవర్ కంటే ముందే ప్రశ్నలు పంపుకోవడానికి వీలవుతుందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రి గానీ, తాను గానీ స్వయంగా ఢిల్లీకి వస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అక్కడ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏ ఏ అంశాలపై ఒత్తిడి తేవాలనే దానిపై చర్చిస్తామన్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికే కేటాయించేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిప్యూటీ సీఎం చెప్పారు. గతంలో ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం 3 బ్లాకులను తిరిగి సింగరేణికి కేటాయించేలా కేంద్రం మీద ఈ సమావేశాల్లో ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సెమీకండక్టర్ ప్రాజెక్టును తీసుకురావడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
భవిష్యత్ అంతా సాంకేతికతపైనే ఆధారపడి ఉన్నందున, సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల క్లియరెన్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌ను ఎంపీలకు అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావలసిన ఐఐఎం, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తప్పనిసరిగా సాధించుకోవాల్సి ఉందన్నారు.
పార్టీలకు అతీతంగా సమాచారిమిస్తాం
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలం గాణ భవన్‌లో కోఆర్డినేషన్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను నియమించామని సీఎం చెప్పారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నాఎంపీలు ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు.
సమావేశంలో ఎంపీలు అడిగిన ప్రతి సమాచారం అంద జేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగు ణంగా తాము కేంద్ర ప్రభుత్వంతో సహకార ధోరణితోనే ముందుకు సాగుతున్నామని, రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపిన లేఖలు, ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ లేఖలు సిద్ధం చేసి పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.






