14 July, 2026 | 3:54 AM

ఓపీఎస్ అమలెప్పుడు?

14-07-2026 01:22 AM
  1. ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు  
  2. ఏపీలో అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ 
  3. తెలంగాణలోనూ అమలు చేయాలి: సంఘాల నేతలు

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో వేసిన ఉద్యోగ నోటిఫికేషన్.. నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకూ నోటిఫికేషన్.. పరీక్ష ఒకటే నిర్వహించారు. మరీ ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను ఆంధ్రప్రదేశ్ అమలు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

దాదాపు ఈ సమస్య 23 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగానే ఉంది. చివరకు సుప్రీంకోర్టులో ఇది పెండింగ్‌లో ఉంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అక్కడి ఉద్యోగ, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు వారికి ఓపీఎస్‌ను వర్తింపజేస్తూ ఉత్వర్వులివ్వడంతో తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తోంది.

బలవంతంగా సీపీఎస్‌లోకి...

01-09-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తించాలి. కానీ కొన్ని సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల వీరంతా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) కింద అమల్లోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 01-09-2004 నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఈ తేదీకి ముందే వివిధ ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయి. ఇలా జారీ అయిన నోటిఫికేషన్లలో డీఎస్సీ-2003, గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ పోస్టులున్నాయి.

అయితే పరిపాలనా కారణల వల్ల ఈ నియామకాలు 01-09-2004 తర్వాత అంటే సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగాయి. వాస్తవానికి వీరంతా ఓపీఎస్ పరిధిలోకి రావాలి. కానీ నియామక ప్రక్రియ 1 సెప్టెంబర్ 2004 తర్వాత జరగడంతో అర్హత ఉన్నప్పటికినీ వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పోలీసులను బలవంతంగా సీపీఎస్ పరిధిలోకి నెట్టేశారు. ఇలా నష్టపోయిన వారిలో దాదాపు 11 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సుమా రు 6 వేల మంది వరకు ఉపాధ్యాయులు, మిగిలిన వారిలో పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పినా!

ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 01-01-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింప జేయాలని 2020, 2023లో మెమోలను జారీ చేస్తూ రాష్ట్రాలకు ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని అమలు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని కేంద్ర సర్వీస్ అధికారులైన ఒక ఐఏఎస్, ఒక ఐఎఫ్‌ఎస్‌కు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాధిత ఉద్యోగులందరికీ వర్తింపజేయ కుండా ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఎలా వర్తింపజేస్తారని నిలదీస్తున్నారు. అంతేకాకుండా తెలం గాణ హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోల అమలుకు అనుకూలంగా తీర్పలను ఇచ్చింది. 

కానీ ఆ తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా తెలంగాణలోనూ అదే పద్ధతిలో ఉద్యోగ, ఉపాధ్యా యులకు ఓపీఎస్ అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఉద్యోగులు డిమాం డ్ చేస్తున్నారు. 

పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 53 ద్వారా, 01--09--2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన తెలంగాణల ఉద్యోగ, ఉపాధ్యాయు లకు కూడా అదే ప్రాతిపదికన పాత పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని గతం లోనే ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ 63 డిమాండ్లలోని ప్రధాన నాలుగు డిమాండ్లలో ఇదొకటి. ప్రభుత్వం వెంటనే దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. 

 కటకం రమేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు 

ఇక్కడ కూడా అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చిన విధంగానే తెలం గాణలోనూ డీఎస్సీ-2003 ఉపాధ్యాయు లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లి. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ఉద్యోగులకు న్యాయం చేయాలి.

హొ చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

ఆ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, ఏపీ ప్రభు త్వం అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలోని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. వేలాది మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. అప్పట్లో పరిపాలన కారణాలతో వీరికి పాత పెన్షన్ వర్తించకుండా పోయింది.

 వొడ్నాల రాజశేఖర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు