29 June, 2026 | 11:46 AM

నాగలి దున్ని, విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

29-06-2026 10:34 AM

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం(Husnabad Constituency) కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి పొన్నం నాగలి దున్ని, విత్తనాలు చల్లారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు.. ఆరుతడి పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. దేశానికే వెన్నెముక లాంటి రైతులకు పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులతో పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. మనం జరుపుకుంటున్న ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక రైతు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ, భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని కోరుకునే పవిత్రమైన రోజన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పిన మాటను గుర్తుచేసిన మంత్రి పొన్నం ఆ అన్నాన్ని పండించే రైతే ఈ దేశానికి వెన్నెముకగా అభివర్ణించారు. 

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ లు , వివిధ గ్రామాల సర్పంచ్ లు , వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.