నీట్ పరీక్షల లీకేజీ నిరసనలో ఎస్ఎఫ్ఐ నాయకుల ముందస్తు అరెస్టు
మొయినాబాద్ జూన్ 29(విజయ క్రాంతి): నీట్ పరీక్షల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో లోక్‌భవన్ కార్యక్రమం సందర్భంగా మొయినాబాద్ పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల అధ్యక్షుడు రేశ్వంత్, మండల కార్యదర్శి చరణ్ గౌడ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని విమర్శించారు. ముందస్తు అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని, నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే ఇటువంటి ముందస్తు అరెస్టులను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది.






