13 April, 2026 | 1:54 AM

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం

13-04-2026 12:00 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మంత్రి సీతక్క

మహబూబాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

జిల్లాలోని కొత్తగూడ మండలంలో గిరిజన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన సంక్షేమ శాఖ, జీసీసీ ఆధ్వర్యంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన రైతులు పండించే పంటలకు సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మధ్యవర్తుల దోపిడీకి తావులేకుండా రైతులు నేరుగా ప్రభుత్వానికి తమ ధాన్యాన్ని విక్రయించే అవకాశం కల్పించడమే ఈ కొనుగోలు కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని మంత్రి వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంతో స్థానిక రైతులకు ఆర్థికంగా పెద్ద ఊతం లభిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రం ప్రారంభం పట్ల గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ సంస్థ మేనేజర్ దేవునాయక్, సెంటర్ ఇన్చార్జ్ శత్రు నాయక్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సారయ్య, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ చల్లా నారాయణరెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు రూప్సింగ్, మొగిలి, మాజీ జెడ్పిటిసి పులుసం పుష్పలత, మాజీ ఎంపీపీ విజయ, ఆలూరి కిరణ్, రణధీర్, సిద్ధబోయిన భద్రయ్య, నక్క మమత, వల్లెపు రంజిత్, బోయినేని ప్రశాంత్ రెడ్డి, గొంది రాజు, ఉబ్బని శ్రీహరి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.