ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైతే.. అభివృద్ధి ఎలా సాధ్యం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ గడ్డ ప్రసాద్ వెల్లడించారు. కౌశిక్ రెడ్డి అలాగే మాట్లాడితే సభ నుంచి సస్పెండ్ చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మందలించారు. కొత్త సభ్యులకు ఇలాంటి సంప్రదాయం సరికాదని స్పీకర్ సూచించారు.
వివేకానంద చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆధారాలు, నోటీసు లేకుండా ఆరోపణలు చేయకూడదని తెలిపారు. ఎమ్మెల్యే వివేకానందకు నిబంధనలపై అవగాహన ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాని సూచించారు. సభలో ఆరోపణలకు ముందు స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదని మండిపడ్డ శ్రీధర్ బాబు అటో రిక్షాల పన్నులు పెంచారు.. అనుమతులు ఇవ్వలేదని విమర్శించారు. ఆటో కార్మికులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, లేనప్పుడు వేర్వేరుగా ఉండవద్దన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైతే వెంటనే అభివృద్ధి ఎలా సాధ్యమని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.






