18 August, 2026 | 3:53 PM

రేపు మంథని, పెద్దపల్లిలో మంత్రుల పర్యటన

18-08-2026 02:45 PM

 రూ.164.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో బుధవారం రాష్ట్ర మంత్రులు విస్తృతంగా పర్యటించనున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఉదయం 10.30 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మంథనిలో మధ్యాహ్నం 2 గంటలకు గంగాపురి వద్ద న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం 2.20 గంటలకు మంథని పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద నాలుగు మండలాలకు చెందిన తొమ్మిది గ్రామాలకు సీఎస్‌ఆర్ నిధులతో మంజూరైన తొమ్మిది వైకుంఠ రథాలను ప్రారంభించనున్నారు. గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు మంథని బస్ డిపో వద్ద రూ.164.64 కోట్ల విలువైన పలు రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. మంథని పట్టణంలో బ్రిడ్జి రోడ్డు నుంచి బస్ డిపో వరకు వెడల్పు డ్రెయిన్ నిర్మాణానికి రూ.15 కోట్లు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.1.20 కోట్లు, గాంధీచౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్‌కు రూ.59 లక్షలు, అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు రూ.35 లక్షలు, క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు రూ.50 లక్షలు, ఇతర వార్డుల రోడ్లకు రూ.9 కోట్లతో పనులు చేపట్టనున్నారు.

అలాగే మంథని డిపో నుంచి డిగ్రీ కళాశాల వరకు రూ.21 కోట్ల సీఎఆర్‌ఎఫ్ నిధులతో రహదారి, మంథని డిపో నుంచి గోదావరి వరకు రెండు కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారికి రూ.22 కోట్లు, సూరయ్యపల్లి నుంచి కాకర్లపల్లి మీదుగా సీతంపేట వరకు 10.8 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.29.94 కోట్లు, గుంజపడుగు నుంచి ఉప్పట్ల మీదుగా విలోచవరం వరకు 10.9 కిలోమీటర్ల రహదారికి రూ.8.78 కోట్లు, కూనారం–ముత్తారం 18 కిలోమీటర్ల రహదారికి రూ.36.28 కోట్లతో పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ సహాయం, మైనార్టీలకు కుట్టు మిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.

అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. మంథని నియోజకవర్గంలో రహదారులు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధిని వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.