18 August, 2026 | 3:12 PM

కల్యాణ లక్ష్మి పథకం కొనసాగించాలి

18-08-2026 02:38 PM

కాంగ్రెస్ కుట్రను అడ్డుకోవాలి 

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేద ఆడబిడ్డలకు అందుతున్న ఆర్థిక భరోసాను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి, మంత్రుల కేసుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ న్యాయవాదులను నియమించుకునే ప్రభుత్వం, పేదల పథకానికి సంబంధించి కోర్టులో సరైన కౌంటర్ దాఖలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ‘తులం బంగారం’ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అమలులో ఉన్న కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ఆడబిడ్డల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.