మైనర్లకు డిజిటల్ రక్షణ అవసరం
- ఫైర్‌వాల్స్ వంటి రక్షణ చర్యలు ఉండాలి
- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం
- పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలి
- 18 ఏళ్లలోపు పిల్లలతో ఏ ఒప్పందమూ చెల్లదు
- సుప్రీంకోర్టులో ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ పిల్
- పిటిషన్‌పై స్పందించాలని కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: భారత దేశంలో మైనర్ల డిజిటల్ భద్రతకు సంబంధించి కొన్ని పటిష్ఠమైన రక్షణ చర్యలు అవసరం అని సుప్రీం కోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఫైర్‌వాల్స్ వంటి రక్షణ చర్యలు ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. సోషల్‌మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల్లో వేధింపుల నుంచి పిల్లలను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కేంద్రానికి సూచించింది.
సోషల్ మీడియాను వినియోగించే పిల్లలకు రక్షణ కల్పించాలని, అలాగే 18 ఏళ్లలోపు పిల్లలతో ఏ ప్లాట్‌ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ మంత్రిత్వ శాఖల నుంచి సుప్రీం కోర్టు గురువారం స్పందన కోరింది. ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ అనే ఎన్జీవో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌లు జయమాల్య బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఆ రెండు మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఎన్జీవో తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హెచ్ ఎస్ ఫూల్కా వాదనలు వినిపించారు.
‘పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ పిల్లలతోనైనా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా మధ్యవర్తులు కుదుర్చుకున్న ఏ ఒప్పందమైనా మొదటి నుంచే చెల్లదు (కుదిరిన క్షణం నుంచే చెల్లదు) అని, దానిని కొనసాగించడాని కి తీసుకున్న ఏ చర్యలనైనా తక్షణమే నిలిపివేయాలి’ అని వారికి తెలియ జేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది.
డిజిటల్ వాతావరణంలో పిల్లల చట్టపరమైన అనర్హతను, రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి సమర్థవంతమైన, ఏకరీతి, అమలు చేయదగిన యంత్రాంగం ఏదీ లేదని, అందువల్ల వారి ప్రాథమిక హక్కులను అమలు చేయాల ని, పరిరక్షించాలని ఈ పిటిషన్ కోరింది. అర్థవంతమైన వయో హామీ, తల్లిదండ్రుల రక్షణలు లేకుండా, పిల్లలు నిరంతరం ఒప్పంద, డేటా ఆధారిత డిజిటల్ పర్యావరణ వ్యవస్థలకు గురికావడం కేవలం ఒక నియంత్రణ లోపం మాత్రమే కాదని స్పష్టం చేసింది. ఇది తీవ్రమైన రాజ్యాంగపరమైన ఆందోళనలను రేకెత్తిస్తుందని తెలిపింది.
ముఖ్యంగా బలహీన వర్గాలను ఆన్లైన్ గ్రూమింగ్, లైంగిక దోపిడీ, అక్రమ రవాణా, ప్రవర్తనాపరమైన తారుమారు, ప్రొఫైలింగ్, వ్యక్తిగత డేటా దుర్వినియో గం, సైబర్బిల్లింగ్, వయసుకు తగని కంటెంట్‌కు గురికావడం వంటి ఊహించదగిన, తీవ్రమైన హానికర పరిణామాలకు గురిచేస్తుందని పేర్కొంది. అందువల్ల పిల్లలకు కల్పించిన చట్టబద్ధమైన, రాజ్యాంగపరమైన రక్షణ ఉండాల్సిందేనని, తక్షణ న్యాయ జోక్యం అవసరమ ని పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ఆటోమేటెడ్ కంటెంట్- ఫిల్టరింగ్ సాధనాలను, వయస్సు ధ్రువీకరణ యంత్రాంగాలను అమలు చేయడంలో ఆయా సంస్థలు విఫలమయ్యాయని వాదించారు.
తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే..
ఆయా ప్లాట్‌ఫారమ్‌ల్లో 13 ఏళ్ల వయస్సు నుంచే వినియోగదారులను ఖాతాలు సృష్టించుకోవడానికి అనుమతిస్తుండ గా, భారత చట్టం 18 ఏళ్ల లోపు వారిని మైనర్లుగా పరిగణిస్తుందని పిటిషన్లో వాదించారు. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల గుర్తింపు ధ్రువీకరణ/ ఈకేవైసీకి లోబడి, వారి సమ్మతి లేకుండా 18 ఏళ్లలోపు పిల్లలతో ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా ఉండేలా చూసేం దుకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ను సవరించాలని లేదా నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలని కోరింది.
ఈ వాదనలతో ఏకీభవించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ‘భారత్‌లోనూ ఇటువంటి రక్షణ చర్యలు అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి స్పందిస్తూ నియంత్రణ కోసం పటిష్ఠమైన ‘ఫైర్‌వాల్స్’ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండే ఖాతాల ద్వారా విద్యా సంబంధిత కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.