ఇజ్రాయెల్ అణుకేంద్రంపై క్షిపణి దాడి
నతాంజ్‌పై దాడికి ఇరాన్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్ న్యూక్లియర్ సెంటర్లే లక్ష్యంగా బాంబులు
భయభ్రాంతుల్లో లిటిల్ ఇండియా దిమోనా
టిట్ ఫర్ టాట్ చేసినట్లు ధ్రువీకరించిన టెహ్రాన్
100 మందికి పైగా గాయాలు, 10 మంది పరిస్థితి విషమం డిమోనా నగరంలో 30 శాతం భారతీయులు
టెహ్రాన్, మార్చి 22: ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. లిటిల్ ఇండియా పేరుగాంచిన డిమోనా నగరంలోని ఇజ్రాయెల్ అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది. ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు రాగా.. వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరాద్, డిమోనా నగరాల్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి.
దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా... భవనాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి. 100 మందికిపైగా ఇజ్రాయెల్ వాసులు తీవ్రంగా గాయపడ్డారు. అరాద్‌లో జరిగిన దాడిలో దాదాపు 88 మంది గాయపడ్డారు. వీళ్లలో 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు రెస్క్యూ టీమ్ తెలిపారు. మరో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడుల్లో కొందరు మరణించి ఉంటారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. కానీ, అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే భవన శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు.
ఈ దాడులపై ఇరాన్ స్పందిస్తూ.. తమ దేశంలోని నతాంజ్ న్యూ క్లియర్ కేంద్రంపై దాడికి ఇది ప్రతిదాడిగా అభివర్ణించింది. దానికి బదులుగానే ఈ టిట్ ఫర్ టాట్ దాడి చేశామని ఇరాన్ వెల్లడించింది. అయితే ఈ దాడి వల్ల అణుకేందానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఇక, ఇజ్రాయెల్‌కు కీలకమైన అణుపరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంలోని ఒక భవనంపై క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడగా.. వారిలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరాద్ నగరంపైకి వచ్చిన క్షిపణిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరాద్ మేయర్‌తో మాట్లాడానని.. గాయపడ్డవారికి వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ దాడులకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే ఇరాన్ ప్రతీకారదాడుల కారణంగా ఇజ్రాయెల్‌లోని ‘లిటిల్ ఇండియా’ పిలవబడే డిమోనా నగరం వణికిపోయింది.
ఈ దాడుల్లో ఇక్కడ దాదాపు 47 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దిమోనా నగరానికి భారతీయ సంస్కృతితో విడదీయలేని సంబంధం ఉంది. ఈ నగరంలో దాదాపు 30 శాతం ప్రజలు ఇండియన్సే. వీరిలో మెజార్టీ ప్రజలు మహారాష్ట్రకు చెందిన వారే. ఈ నగరంలో నడుస్తుంటే.. ముంబై వీధుల్లో తిరిగే అనుభూతి కలుగుతుంది. ఇక్కడ పాప్రీచాట్, భేల్ పూరి, గలాబ్ జామ్, సోన్ పాపడీ వంటివి విడిగా దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువగా మరాఠీ మాట్లాడుతారు. ఇజ్రాయెల్ ఫుట్ బాల్ ఆటకు క్రేజ్ ఉన్నప్పటికీ, మోనాలో మాత్రం క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది.




