5 March, 2026 | 7:41 AM

లెబనాన్‌పై క్షిపణుల మోత

05-03-2026 02:31 AM

ఇజ్రాయెల్ డ్రోన్ల ధాటికి కంపించిన బిరుట్

నివాస సముదాయాలు, కీలక భవనాలు నేలమట్టం

జనసంచార ప్రాంతాల్లో ఇజ్రాయెల్  బాలిస్టిక్ క్షిపణులు

లెబనాన్ వీధుల్లో రక్తపాతం, మిన్నంటిన బాధితుల రోదనలు

120 మందికి పైగా పౌరులు మృతి

450 మందికి తీవ్ర గాయాలు

ఎమర్జెన్సీని ప్రకటించిన లెబనాన్ ప్రభుత్వం

బిరుట్, మార్చి 4 : పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రం గా కొనసాగించింది. బుధవారం తెల్లవారుజాము నుంచి లెబనాన్ భూభాగమే లక్ష్యం గా ఇజ్రాయెల్ తన క్షిపణి శక్తిని ప్రయోగించింది. బిరుట్ నగరంతో పాటు దక్షిణ లెబనాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రపక్షాలకు మద్దతు ఇస్తున్నారనే ఆగ్రహంతో ఇరాన్ ఈ దాడులకు తెగబడింది.

ఆకాశం నుంచి నిరంతరాయంగా వస్తున్న క్షిపణులు, డ్రోన్ల ధాటికి లెబనాన్ రాజధాని నగరం బిరుట్ కంపించిపోయింది. నివాస సముదాయాలు, కీలక భవనాలు నేలమట్టం కావడంతో నగరం అంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాడుల తీవ్రత ఊహకందని విధంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు లెబనాన్ రక్షణ కవచాలను ఛేదించి జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో పడ్డాయి.

ఈ దాడుల్లో 120 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు, సుమారు 450 మంది తీవ్రంగా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రులతో స్థానిక ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. రక్తపాతం మధ్య బాధితుల రోదనలతో లెబనాన్ వీధులు దయనీయంగా మారాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో ఆసుపత్రుల్లో చికిత్స అందించడం వైద్య సిబ్బందికి పెను సవాల్‌గా మారింది.

క్షిపణుల దాడులతో పాటు ఇజ్రాయెల్  వందలాది ఆత్మహుతి డ్రోన్లను కూడా ప్రయోగించింది. ఇవి నేరుగా సైనిక స్థావరాలను, సమాచార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని పేలిపోయాయి. దక్షిణ లెబనాన్‌లోని ప్రధాన రహదారులు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. సరిహద్దుల గుండా పొరుగు దేశాలకు వెళ్లేందుకు జనం భారీగా తరలిరావడంతో గందరగోళం నెలకొంది. ఇజ్రాయెల్  దాడుల నేపథ్యంలో లెబనాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అంతర్జాతీయ సమాజం ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్ తన దాడులను ఆపకపోతే గల్ఫ్ ప్రాంతం మొత్తం రణరంగంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. లెబనాన్‌లో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు ప్రత్యేక విమానాలను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు విడిపోయేలా కనిపించడం లేదు సరికదా.. ఇరాన్ మరిన్ని దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే గంటలు లెబనాన్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి. 

3 ఇజ్రాయెల్ స్థావరాలపై దాడి చేశాం: హెజ్బొల్లా

డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌కు చెందిన 3 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలతో సహా లెబనాన్లోని తమ బేస్లపై దాడులకు స్పందనగానే ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, లెబనాన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్లను అడ్డగించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా టీవీ, రేడియో కేంద్రాలు ధ్వంసమయ్యాయి.

ఉధృతంగా దళాలు మున్ముందుకు

ఇజ్రాయెల్ సైన్య దళాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయి. టెహ్రాన్, బీరుట్లపై పెద్ద ఎత్తున వైమానిక దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. తన సైనిక దళాలను దక్షిణ లెబనాన్లోకి పంపింది. “లెబనాన్తో సరిహద్దులోని మరిన్ని కమాండింగ్ ప్రాంతాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ప్రధాని నెతన్యాహు, నేను కలిసి ఇజ్రాయెల్ రక్షణ దళాలకు ఆదేశాలిచ్చాం” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేసినందుకు హెజ్బొల్లా ఉగ్ర సంస్థ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

కాగా, సైన్యాన్ని దక్షిణ లెబనాన్లోకి పంపడాన్ని సరిహద్దుల్లో వ్యూహాత్మక చర్యగా ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా సంస్థ ప్రకటించిన నేపథ్యంలోనే సరిహద్దులకు అదనపు బలగాలను పంపినట్లు తెలిపింది. మరోవైపు హెజ్బొల్లా ఉగ్రవాదుల వేటలో ఇజ్రాయెల్‌కు సహాయపడతామని లెబనాన్ ప్రకటించింది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా తమ సైనికులు దక్షిణ లెబనాన్‌లో పనిచేస్తున్నారని, సరిహద్దులో అదనపు బలగాలను మోహరించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

దక్షిణ లెబనాన్‌లోని 80కిపైగా గ్రామాలు, పట్టణాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి కనీసం కిలోమీటరు దూరం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లోని హెజ్బొల్లా ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామని తెలిపింది. ఉగ్రవాద సంస్థకు పట్టున్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే 52 మంది మరణించారు.