12 June, 2026 | 2:49 AM

మెట్రో ఫేజ్-2 అంగీకరించండి

12-06-2026 02:02 AM
  1. 76.4 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి ఎంతో అవసరం
  2. మీ సూచనల మేరకు సవరణల డీపీఆర్ ఇచ్చాం
  3. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-2 అవసరం ఎంతో ఉందని సీఎం కేంద్రమంత్రికి వివరించారు.

మెట్రో ఫేజ్-2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శా ఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలన్నారు.

ఈ సమావేశంలో సీఎం వెంట ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్, స్పెషల్‌సెక్రటరీ (కో-ఆర్డి నేషన్) అద్వైత్‌కుమార్‌సింగ్ పాల్గొన్నారు.