మియాపూర్ ప్రభుత్వ స్థలంలో నెలకొన్న ఉద్రిక్తతకు తెర.. 144సెక్షన్ విధింపు
హైదరాబాద్: మియాపూర్ ప్రభుత్వ స్థలంలో నెలకున్న ఉద్రిక్తతకు తెరపడింది. ప్రభుత్వ భూమల ఆక్రమణకు వచ్చిన వారిని పోలీసులు చెదరగొట్టారు. హెచ్ఎండీఏ, పోలీసులు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మియాపూర్ ప్రభుత్వ స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. ప్రజల వెనకున్న కబ్జాదారుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కబ్జాదారులపై పీడీయాక్ట్ కింద కేసులు పెడతామ న్నారు. మియాపూర్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144సెక్షన్ విధించారు. మియాపూర్, చందానగర్ పీఎస్ పరిధిలో ఆదివారం నుంచి 29 అర్థరాత్రి వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందని, 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ అవినాష్ మహంతి హెచ్చరించారు.
మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టిన సంగీత, స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ పెట్టి మహిళలను రెచ్చగొట్టేలా స్పీచ్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మియాపూర్ ప్రభుత్వ స్థలం విషయంలో పది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు నమోదు పెట్టారు. ప్రస్తుతం పరారీ లో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసుల పై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.






