తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. అటు శనివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ అప్రమత్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో 4.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లా కోస్గి మండలం గూడాపూర్‌లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 12.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది.






