సరస్వతీ పుత్రునికి ఎమ్మెల్యే సాయం
తిమ్మాపూర్ (విజయక్రాంతి): సరస్వతి పుత్రుడికి లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana) తాను సాయం చేయడమే కాకుండా ఇతరులను సాయం చేసేలా ప్రోత్సహించారు. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన మార చంద్రకళ శంకర్ దంపతులు పేద కుటుంబం. వీరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు కుమారుడు మహేష్, కూతురు వైష్ణవి ఉన్నారు. మహేష్ కి ఎన్ఐటీలో సీటు సాధించిన లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. మహేష్ విషయం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలియడంతో ఆయన ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. అంతేకాదు రాజకీయ నాయకుల తో పాటు అధికారులను సైతం ఆర్థిక సాయం అందించాలని కోరారు.
దీంతో నియోజకవర్గంలోని అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ముందుకొచ్చి తమ వంతు సహాయంగా 3,30,000 ఆర్థిక సహాయాన్ని జమ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహేష్ ను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆర్థిక సహాయం చెక్కును అందజేసి, అభినందించి సన్మానించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహేష్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలను సైతం ఎమ్మెల్యే అభినందించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు తమ పిల్లల్ని ప్రభుత్వ గురుకులాల్లో చదివించుకుంటున్నారు. మహేశ్ జేఈఈ మెయిన్స్ రాసి ఆల్ ఇండియా 453 ర్యాంకు, ఎస్సీ విభాగంలో 17 ర్యాంకును సాధించారు.
దీంతో తమిళ నాడులోని తిరుచిరాపల్లి జాతీయ సాంకేతిక విద్యాలయం(ఎన్ఐటీ)లో ఆర్కిటెక్చర్లో సీటు పొందాడు. మొదటి ఏడాది మొత్తం రూ.1.50 లక్షలు చెల్లిం చాల్సి ఉందని మహేశ్ చెప్పాడు. ముందుగా రూ. 15 వేల ప్రవేశరుసుం చెల్లిం చామన్నాడు. రెండో సంవత్సరం రూ.1.17 లక్షలు, మూడో ఏడాది రూ.1.20 లక్షలు, నాలుగో ఏడాది రూ.1.27 లక్షలు, ఐదో సంవత్సరానికి రూ.1.25. లక్షలు చెల్లించాల్సి ఉందని వివరించాడు. కూలీ పనులు చేసుకునే తమకు అంత ఫీజు చెల్లించే స్తోమత లేదని. దాతలు ఆదుకోవాలని విద్యార్ధి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. విద్య ఉంటే తప్పకుండా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
విద్యలో రాణిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే మహేష్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దాతలు ముందుకొచ్చి మహేష్ కుటుంబానికి సాయం అందించాలని ఆయన కోరారు. భవిష్యత్తు కాలంలో మంచి స్థానానికి ఎదిగి పేదవారికి సహాయం అందించాలని మహేష్ కు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ తహసీల్దార్లు శ్రీనివాసరెడ్డి విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఎస్ ఎల్ గౌడ్, ఒగ్గు దామోదర్, బండారి రమేష్, నందగిరి రవీంద్ర చారి, మోరపల్లి రమణారెడ్డి, శ్రీనివాసరావు, మామిడి అనిల్, చింతల లక్ష్మారెడ్డి, మాడ తిరుపతిరెడ్డి, ఓదేలు, రామిడి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




