18 June, 2026 | 1:57 AM

పూర్తయిన ఇందిరమ్మ గృహాలకు వెంటనే బిల్లులు ఇవ్వాలి

18-06-2026 12:41 AM

ఉమ్మడి కుటుంబాల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి

ఇళ్లు ప్రారంభించని వారి నుండి ‘నాట్ విల్లింగ్’ పత్రాలు తీసుకోవాలి.

అధికారుల సమీక్షాసమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 17 (విజయక్రాంతి): ఉమ్మడి కుటుంబాల పెండింగ్ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల, నిర్మాణం పూర్తిచేసుకున్న ఇండ్ల లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు తక్షణమే క్లియర్ చేసి పేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖా అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తూ, సొంత ఇల్లు లేని లబ్ధిదారుల పేమెంట్లను సాంకేతిక కారణాలతో నిలిపివేయడం సరికాదన్నారు. గతంలో ఇల్లు ఉండి ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరిన వారిని కూడా ఆదుకోవాలని, 600 చదరపు అడుగుల నిబంధనతో సమ్మతి పత్రాల పేరిట బిల్లులు ఆపవద్దని ఆదేశించారు. జీవనోపాధి కోసం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయనే కారణంతో దరఖాస్తులను తిరస్కరించడం తగదని, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు స్పష్టంగా ఉండాలన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో బేస్, రూఫ్, స్లాబ్ లెవల్ వరకు ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇల్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారి నుంచి నాట్ విల్లింగ్ లెటర్లు తీసుకోవాలని, మొదటి విడతలో మిగిలిపోయిన 199 మంది పేర్లను త్వరగా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

రెండో విడతకు సంబందించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాల సేకరణ, మంజూరు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, మేయర్ మూడ్ గణేష్, హోసింగ్ ఇంచార్జి పిడి సవే రామ్, డీఈ ఖలీల్, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపిడివోలు సుభాషిణి, సుస్మిత, భారతి,  ఏఈలు రమేష్ బాబు, డేవిడ్, నసీరుద్దీన్, పుష్ప, లాల్ సాహెబ్, హసిత, బాధిత లబ్ధిదారులు పాల్గొన్నారు.