25 July, 2026 | 8:10 PM

కారేపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ జన్మదిన వేడుకలు

25-07-2026 07:37 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు

సర్పంచ్ టోనీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కారేపల్లి,(విజయక్రాంతి): వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్  జన్మదిన వేడుకలను సింగరేణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాందాస్ నాయక్ తనయుడు మాలోత్ విగ్నేష్ నాయక్ పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటూ ఎమ్మెల్యేకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేసి ర్యాలీ నిర్వహించిన అనంతరం కారేపల్లి సినిమా హాల్ సెంటర్ పార్టీ కార్యాలయం నందు అన్నదాన  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని రాందాస్ నాయక్ తనయుడు మాలోత్ విగ్నేష్ నాయక్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సర్పంచ్ టోనీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగరేణి సర్పంచ్ మెదరి టోనీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఒకరి ప్రాణాలను కాపాడే గొప్ప దానంగా రక్తదానాన్ని అభివర్ణిస్తూ, ఎమ్మెల్యే జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని ఆయన  పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడని కొనియాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాశాలు లభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.