25 July, 2026 | 8:14 PM

నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

25-07-2026 07:41 PM

- బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయి 

- నేను పీడిత వర్గాలను ఉద్ధరిస్తుంటే ప్రతి పక్షాలకు గిట్టడం లేదు.

- రైతుల కష్టాలు తీర్చేందుకే 4 లిఫ్ట్ ఇరిగేషన్ లు 

- రాష్ట్రానికే నియోజకవర్గం తలమానికం

- ఎల్ ని నో వలన పంటలను మార్చాలి 

- మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): గడిచిన 70 ఏండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమం నేడు మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతుందని, ప్రతిపక్షాలకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. శనివారం పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన లక్షేట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ఎన్నో హామీలను కూడా నెరవేర్చినట్లు తెలిపారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను మహిళ ఐకేపీ కేంద్రాలకు కేటాయించి రాష్ట్రానికే మార్గనిర్దేశం చేశామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళ సంఘాలు లబ్ధి పొందేలా ప్రేరణ మన నియోజక వర్గం నుంచే ప్రారంభం అయినట్టు వివరించారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న బీద, పీడిత వర్గాల అభ్యున్నతికి తాను పాటు పడితే ప్రతి పక్షాలకు గిట్టడం లేదని మండిపడ్డారు. నియోజక వర్గంలో రైతుల కష్టాలు తీర్చేందుకు 4 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు చేపడుతున్నట్లు వివరించారు.

దండేపల్లి మండలంలోనే ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా పలు రకాల పనులు జరుగుతున్నాయని, సీఎం, డిప్యూటీ సీఎం నియోజక వర్గాలకు ధీటుగా అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంటే మాపై కొందరు అసత్య ఆరోపణలు చేయడం వారి విజ్ఞతను సూచిస్తుందన్నారు. కొందరు నాయకులు ఇతర వర్గాల్లోకి వెళ్లిపోయినంత మాత్రాన మాకు జరిగే నష్టమేమి లేదని ధీమా వ్యక్తం చేశారు. ఓపిక, సంయమనం వున్నవారికి మాత్రమే న్యాయం జరుగుతుందని, కష్టపడిన ప్రతి కార్యకర్తను తాను మర్చిపోనని గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామంటే నవ్విన వారికి, ఇప్పుడు చేతల్లో నిర్మించి చూపిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యేకు కూరగాయల మార్కెట్, ఆసుపత్రికి తేడా తెలియదని ఏద్దేవా చేశారు. కరకట్ట నిర్మాణంతో మంచిర్యాల ప్రజల కష్టాలను దూరం చేస్తున్నామన్నారు. లక్షేట్టిపేట జూనియర్ కళాశాల అడ్మిషన్స్ లో, ఆసుపత్రి రోగుల సేవలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయని తెలిపారు. ఎల్ ని నో ప్రభావం వలన రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, పెసర్లు, కంది,  ఇతర పంటలు సాగు చేయాలని చేతులు జోడించి వేడుకున్నారు.

వర్షాలు పడకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, ముందు చూపుతో ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులు తమ జేబులో నుంచి కేంద్ర నిధులు ఇవ్వడం లేదని, రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం నాడు రైతుల ధర్నా, నేడు యువత తిరుగుబాటుతో ఎలా తోక ముడిచిందో ప్రజలు చూస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు.

అంతకుముందు ఎమ్మెల్యే, స్థానిక నాయకుల సమక్షంలో లక్షేట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా చాతరాజు రాజేష్ లతో పాటు డైరెక్టర్స్ ను జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి షాబొద్దిన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం నాగలి కర్రును బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.

'సర్'లో వెనుకపడినం

'సర్'  నమోదు ప్రక్రియలో మన నియోజక వర్గం చాలా వెనుకపడిందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నాయకులకు చురకలు అంటించారు. ఈ మిగిలిన కొన్ని రోజుల్లో నాయకులు, కార్యకర్తలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని  పిలుపునిచ్చారు. రాత్రి, పగలు పని చేసి 'సర్' నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు లక్షేట్టిపేట మార్కెట్ కమిటీ పదవిని భర్తీ చేయకుండా దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల నాయకులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షేట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగభూషణం, పూర్ణ చందర్ రావు, త్రిమూర్తులు, పింగళి రమేష్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు రామగిరి బానేష్, పలు గ్రామాల సర్పంచ్ లు, కౌన్సిలర్లు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.