అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
ఖేడ్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే
నారాయణఖేడ్, సెప్టెంబర్ 1: అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేసే నియోజకవర్గం ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్ పి .సంజీవరెడ్డి అన్నారు మంగళవారం నారాయణఖేడ్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు నాయకులకు పలు సూచనలను అందించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు తమ సమస్యలను అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పథకాల ప్రయోజనం వారికి అందేలా చూడాలని అన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు, రోడ్ల అభివృద్ధి, విద్యా సంస్థలు, వైద్య సేవలు తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్,మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






