రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం
ముకరంపుర,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ని పరామర్శించేందుకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అక్రమ హౌస్ అరెస్టును ఖండిస్తూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీకి రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే, అధికార పార్టీ నేతలు అరాచకాలకు దిగుతున్నారని విమర్శించారు.
నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి కుటుంబ సభ్యులపై, ఆయన తల్లిపై భౌతిక దాడులు చేసిన గూండాలను వదిలేసి, బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడిని గృహనిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన సాగుతోందని, శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్లేశం మండిపడ్డారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఉధృతమైన ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.






