16 April, 2026 | 2:43 AM

కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే

16-04-2026 01:10 AM

ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలి

టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన ఎమ్మెల్సీ 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16(విజయక్రాంతి): విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, ఈ సమస్యపై తాను పలుమార్లు మార్నింగ్ న్యూస్ వేదికగా మాట్లాడినట్టు, అలాగే శాసన మండలిలో కూడా ప్రస్తావించినట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా డివిజన్ కార్యాలయం ముందు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేప ట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటై   రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని నేరుగా కలిసి సమస్య వివరించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే సమిష్టిగా పోరాటం చేయాల్సిందేనని, కార్మికుల ప్రతి ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని మల్లన్న హామీ ఇచ్చారు. రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని భరోసా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ స్థానిక నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.