మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మూడు రోజల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. శక్రవారం సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడగా, కామారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.






