కవితతో కేటీఆర్ ములాఖత్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): మద్యం కేసులో ఆరోప ణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షే మాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్టయిన కవితపై సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సీబీఐ కేసు నమోదైంది. దాదాపుగా 3 నెలల నుంచి ఆమె ఈ కేసులో జైళ్లోనే ఉన్నారు.
సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21వ తేదీ వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21 జరుగనున్న నేపథ్యంలో కేటీఆర్ ములాఖత్ ప్రాధాన్యం సంతరించుకుంది. కవితను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె తరఫున న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్ని స్తున్నా దర్యాప్తు సంస్థలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. బెయిలుకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి.






