మంథని, కాళేశ్వరం బస్టాండ్ల ఆధునికీకరణ
- గోదావరి పుష్కరాలకు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు
- మహిళలకు ఇప్పటివరకు రూ. 310 కోట్లకుపైగా ‘జీరో’ టికెట్ల జారీ
- మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి/ మంథని, మే 31(విజయక్రాంతి): మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజారవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృ ద్ధి పనులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షలతో కలిసి ఆదివారం మంత్రి పొన్నం శంకు స్థాపన చేశారు.
ఈ సం దర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆర్టీసీ బలోపేతానికి, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాలకు భారీ కార్యాచరణ గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.కుంభమేళాను తలపించేలా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న బస్టాండ్లను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమ్మక్క-సారలమ్మ జాతర తరహాలోనే పుష్కరాలకు కూడా ప్రత్యేక రవాణా సదుపాయాలు ఉంటాయన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇప్పటివరకు రూ.310 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ‘ఇందిరా మహిళా’ ద్వారా మహిళలను ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. గత ప్రభు త్వం పదేళ్లలో కొత్త బస్సు లు, నియామకాలు, డిపోల ఏర్పాటును విస్మరించిందని మంత్రి పొన్నం విమర్శించారు. ప్రజాప్రభుత్వం వచ్చా క ఆర్టీసీ రికార్డు స్థాయిలో వృద్ధి సాధిస్తోందని అన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, గుర్తింపు సం ఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంథని బస్టాండ్‌లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇత ర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూ రు చేసినట్లు తెలిపారు.
అలాగే కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని, కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.దశాబ్దాల నాటి ప్రజా ఆకాంక్ష అయిన పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటు త్వరలోనే సాకారం కానుందని, మంథని బస్టాండ్ ఆధునికీకరణతో పాటు దీనిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. డిప్యూ టీ సీఎం నాయకత్వంలో ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్‌ఎమ్‌మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డీఓ సురేష్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతియాదవ్, మండలా ధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మూల సరోజన, నాయకులు శశిభూషణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






