3 July, 2026 | 4:39 PM

కులగణన అంటే మోదీకి భయం!

24-09-2024 01:00 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కులగణన పేరు చెప్పడానికే ప్రధాని మోదీ భయపడుతున్నారని, బహుజనులు హక్కులను పొందడం ఆయనకు ఇష్టం లేదేమోనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఎంత దుష్ప్రచారం చేసినా రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించి.. సమగ్ర కులగణన జరుపుతామని, ప్రతీ వర్గానికి వారి హక్కులు అందేలా చూస్తామన్నారు.

కులగణన కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని, వెనుకబడిన వారందరికీ న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఇటీవల యూఎస్ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో అన్నీ వర్గాలకు సమాన అవకాశాలు లభించిన అనంతరం రిజర్వేషన్లు రద్దు చేస్తామని రాహుల్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.