14 July, 2026 | 7:35 PM

వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం

14-07-2026 07:02 PM

గంగాపురిలో వృద్ధ మహిళపై దాడి.. తీవ్ర గాయాలు

మున్సిపాలిటీ, అటవీ శాఖ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని గంగాపురి కాలనీలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వారం రోజుల క్రితమే కోతుల దాడులపై ప్రజలు అధికారులను హెచ్చరించినప్పటికీ ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం మరోసారి కోతుల బీభత్సం చోటుచేసుకుంది. గంగాపురికి చెందిన తాటి సత్యమ్మ అనే వృద్ధ మహిళపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమె కాలికి తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే స్పందించి కోతులను తరిమికొట్టగా, తాటి శ్రీధర్ గౌడ్ సాహసంగా సత్యమ్మను రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన సమయస్ఫూర్తితో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.

గతంలో కూడా ఇదే సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపాలిటీ, అటవీ శాఖ అధికారులు కేవలం హామీలకే పరిమితమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల సంఖ్య పెరుగుతుండటంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాల కంటే అధికారుల నిర్లక్ష్యమే పెద్దదా అని ప్రశ్నిస్తున్న గ్రామస్థులు, వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కోతులను పట్టుకుని గ్రామం నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.

కోతుల బెడదకు శాశ్వత పరిష్కార కార్యాచరణ అమలు చేయాలి.

ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇంకెంత మంది గాయపడాలని... ఒక ప్రాణం పోయాకే అధికారులు మేల్కొంటారా?" అని గంగాపురి ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.

కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

మంథని పట్టణంలోని గంగాపురి కాలనీలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడడం, వృద్ధులు, మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడడం నిత్యకృత్యంగా మారింది. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. అటవీ శాఖ, మున్సిపాలిటీ, స్థానిక పరిపాలన సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టి కోతులను సురక్షితంగా పట్టుకుని అడవుల్లోకి తరలించడం, ప్రజలకు అవగాహన కల్పించడం, చెత్త నిర్వహణను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోతుల బెడదపై ఇకనైనా ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని గంగాపురి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.