6 July, 2026 | 9:27 AM

రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, బీద రాజీనామా

30-08-2024 12:49 AM
  1. రాజ్యసభ చైర్మన్ ఆమోదం 
  2. ఏపీలో రెండు స్థానాలు ఖాళీలు ఉన్నట్టు ప్రకటన

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యత్వానికి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు యాదవ్ గురువారం రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వెంటనే ఏపీలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఎంపీ పదవులకు రాజీనామా చేసి జగదీప్ ధన్కడ్‌కు అందజేశారు. అదే విధంగా వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

టీడీపీలో చేరుతున్నట్టు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. మరో ఆరుగురు ఎంపీలు కూడా తమ పదవులతోపాటు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీవైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు కమలం వైపు వెళ్లవచ్చని అంటున్నారు.